పుట:Oka-Yogi-Atmakatha.pdf/736

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

700

ఒక యోగి ఆత్మకథ

శ్రీయుక్తేశ్వర్‌గారు కోరిన కోరికను నే నెన్నడూ మరిచిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో, అవకాశం దొరికినప్పుడల్లా, ఆ యోగావతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్నీ బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను. వాళ్ళతో జరిగిన సంభాషణలు రాసి పెట్టుకుంటూ, యథార్థ విషయాల్నీ తేదీల్నీ సరిచూసుకుంటూ, ఫొటోలూ పాత ఉత్తరాలూ పత్రాలూ సేకరించాను. నా ‘లాహిరీ మహాశయ దస్త్రం’ పెరగడం మొదలయింది. గ్రంథకర్తృత్వంలో నేను పడవలసిన పాట్లు ముందు ఉన్నాయని గ్రహించి డీలా పడిపోయాను. ఆ మహాగురువుల జీవితకథారచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థించాను. లిఖిత వృత్తాంతంలో తమ గురువుగారిని తక్కువ చెయ్యడంకాని, తప్పుడు వ్యాఖ్య చెయ్యడంకాని జరుగుతుందేమోనని, ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు.

“దైవావతారుల జీవితానికి, పసలేని పలుకులతో ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు,” అని నా దగ్గర వ్యాఖ్యానించారు, పంచానన్ భట్టాచార్యగారు.

ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదే విధంగా, ఆ యోగావతారుల్ని అమర గురుదేవులుగా తమ గుండెల్లో దాచి పెట్టుకోడంతోనే తృప్తిపడ్డారు. అయినప్పటికీ, లాహిరీ మహాశయులు తమ జీవిత చరిత్రను గురించి చెప్పిన జోస్యం నా మనస్సులో ఉండడంవల్ల, ఆయన బాహ్యజీవితానికి సంబంధించిన యథార్థ విషయాల్ని సేకరించి సత్యనిరూపణకు శక్తివంచన లేకుండా కృషి చేశాను.

స్వామి కేశవానందగారు, బృందావనంలో ఉన్న తమ కాత్యాయనీ పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. చక్కని తోటలో ఉన్న ఆ ఆశ్రమం, భారీఎత్తు నల్ల స్తంభాలతోను, ఇటికలతోను కట్టింది. ఆయన వెంటనే మమ్మల్ని, కూర్చునే గదిలోకి తీసుకువెళ్ళారు;