పుట:Oka-Yogi-Atmakatha.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

699

“లేదు యోగానందా, ఇలా గంగ ఒడ్డున తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు,” అని ఒక్క క్షణం దిగులుగా అనుకున్నాను.

ఆ సాధువు, తమ ఆధ్యాత్మికానుభూతులు కొన్ని నాకు చెప్పిన తరవాత, నేను చటుక్కున ఒక ప్రశ్న వేశాను.

“మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంలో చెబుతున్నారా, మీ అంతరికానుభవంతో చెబుతున్నారా?”

“పుస్తకాల్లో చదివింది సగం, అనుభవంలో సగం,” అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబు ఇచ్చారు.

మేము కొంతసేపు ధ్యానమౌనంలో కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలివచ్చిన తరవాత నేను శ్రీ రైట్‌తో, “బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయన,” అన్నాను.

ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద, పుల్లలతో కుట్టిన విస్తళ్ళలో భోజనాలు చేశాం. పళ్ళాలు కడిగే బెడదను భారతదేశంలో కనీస స్థాయికి తగ్గించడం జరిగింది.

సమ్మోహం కలిగించే ఆ కుంభమేళాలో మరో రెండు రోజులు ఉన్నాం; తరవాత వాయవ్యంగా ప్రయాణించి, యమునాతీరంలో ఉన్న ఆగ్రా చేరాం. మళ్ళీ మరోసారి తాజ్‌మహల్ వేపు చూపు సారించాను; పాలరాతితో మలిచిన ఆ స్వప్నాన్ని తిలకించి అప్రతిభుణ్ణి అయాను; జితేంద్రుడి పక్కన నించుని ఉన్న వెనకటి సన్నివేశం నా మనస్సులో మెదిలింది. అక్కణ్ణించి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానందగారి ఆశ్రమానికి వెళ్ళాం.

కేశవానందగారి కోసం వెళ్ళడంలో నా ఉద్దేశ్యం, ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది. నన్ను లాహిరీ మహాశయుల జీవిత చరిత్ర రాయమని