పుట:Oka-Yogi-Atmakatha.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

698

ఒక యోగి ఆత్మకథ

దేవుణ్ణే నమ్ముకుని ఉండడంవల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలు ఏవీ ఉండవు; పవిత్ర నదీతీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప వాహనాలు ఎక్కడమన్నది అసలే ఉండదు; మమకారాల్ని తప్పించుకోడం కోసం, వారం రోజులకంటె ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు.”

“అటువంటి వినయాత్ముడీయన! వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన, బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. ఏ. పట్టం, శాస్త్రి (శాస్త్రాల్లో పండితుడు) పట్టం గడించినవాడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒకానొక మహత్తరానుభూతి నాలో వ్యాపించింది; నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు, ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది; ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన.”

కరపాత్రిగారిని, ఆయన సంచారజీవితం గురించి అడిగాను. “చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా?”

“లేవు, ఇది చాలు.”

“మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా?”

“ఊఁహుఁ. నేను చెప్పేది వినదలిచినవాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను.”

“ఇంకా ఏం చేస్తారు?”

“గంగ ఒడ్డున తిరుగుతాను.”

ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు, ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే బాగుండునన్న తపన నన్ను వివశుణ్ణి చేసింది. అమెరికానీ, అక్కడ నా భుజాలమీదున్న బరువు బాధ్యతల్నీ గుర్తు చేసుకున్నాను.