పుట:Oka-Yogi-Atmakatha.pdf/733

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

697

ల్లోంచి, జారుడు ఇసకమీద కొంతదూరం నడిచి, అడుసుమన్నూ గడ్డీ కలిపి వేసిన చిన్న చిన్న గుడిసెల సమూహానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒకదాని ముందు ఆగాం. దానికి తలుపు లేదు; లోపలికి ప్రవేశించడానికి చిన్న దారి ఉంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బసచేస్తున్నది అక్కడే; విశిష్టమైన ప్రతిభకు పేరు పొందిన వాడాయన. అక్కడ, ముదురు పసుప్పచ్చ వన్నెగల గడ్డిచాపమీద బాసెం పట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆయన ఆయనకున్న ఒకేఒక ఆచ్ఛాదన- పై పెచ్చు, ఆయనకున్న ఒకేఒక ఆస్తి- భుజాలమీద కప్పుకున్న కాషాయ వస్త్రం.

“మేము కాళ్ళూ చేతులూ నేలకు ఆనించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి, ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి, దివ్యత్వం ఉట్టిపడే ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశమార్గం దగ్గరున్న కిరసనాయిలు లాంతరు వింతగా అల్లల్లాడుతోంది; గుడిసె గోడలమీద నీడలు ఆడుతున్నాయి. ఆ సాధువు కళ్ళు సంతోషంతో వెలిగాయి. చక్కని ఆయన పలువరస ధగధగా మెరిసింది. ఆయన మాట్లాడే హిందీ నేను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, ఆయన ముఖ కవళికలు చాలా స్పష్టంగా ఉన్నాయి; ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవ్వరికీ సంశయం కలగదు.”

“భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాడు సుఖజీవనాన్ని గురించి ఊహించుకోడు. బట్టల సమస్య ఉండదు; రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడంవల్ల రకరకాల తిళ్ళకోసం మొహం వాచడం ఉండదు; ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవీ దాచి పెట్టుకోకుండా ఎప్పటికీ