పుట:Oka-Yogi-Atmakatha.pdf/731

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

695

చుట్టూ ఆకర్షణ కలిగించే సాధువులు[1] ఉన్నారు; వాళ్ళ జుట్టు జెడలుకట్టి తలమీద చుట్టచుట్టి ఉంది. వాళ్ళలో కొందరికి, కొన్ని అడుగుల పొడుగు గల గడ్డాలు ఉన్నాయి; వాటిని చుట్టచుట్టి ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ధ్యానంలో నయినా ఉంటారు, లేదా చెయ్యిచాపి దారినిపోయే జనాన్ని ఆశీర్వదిస్తూ నయినా ఉంటారు - బిచ్చగాళ్ళు, ఏనుగుల మీద సాగే మహారాజులు, వన్నెవన్నెల చీరలు కట్టుకుని గలగలలాడే గాజులతోనూ గల్లుగల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు, వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీర్లు, యోగదండాల్ని పట్టుకువెళ్ళే బ్రహ్మచారులు, అంతరంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్టుగా అదే పనిగా మోగే గుడిగంటల పిలుపు.

మేము మేళాకు వచ్చిన రెండో రోజున, నా సహచరులూ నేనూ వివిధ ఆశ్రమాల్లోకీ, తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధుసత్పురుషులకు ప్రణామాలు చేశాం. మఠామ్నాయంలో ‘గిరి’ శాఖ నాయకుల ఆశీస్సులు అందుకున్నాం - చిరునవ్వు చిందించే నిప్పులవంటి కళ్ళూ బక్కపలచని ఒళ్ళూ గల తపస్వి ఆయన. ఆ తరవాత మరో ఆశ్రమానికి వెళ్ళాం; అక్కడి ఆశ్రమ గురువులు అప్పటికి తొమ్మిదేళ్ళుగా మౌనవ్రతంలో ఉన్నారు; పండ్లు మాత్రమే ఆయన ఆహారం.

  1. భారతదేశంలో ఉన్న కొన్ని లక్షలమంది సాధువుల్ని నియంత్రించడానికి ఏడుగురు నాయకులతో కూడిన కార్యవర్గం ఒకటి ఉంది; ఈ ఏడుగురూ భారతదేశంలో ఉన్న ఏడు పెద్ద విభాగాలకు ప్రతినిధులు. నేను ‘మహామండలేశ్వరు’ల్ని – అంటే అధ్యక్షులైన శ్రీ శ్రీ జయేంద్రపురిగారిని కలుసుకున్నాను. ఈ సాధుపుంగవులు చాలా మితభాషులు; ఈయన తమ ప్రసంగాన్ని తరచుగా - ‘సత్యం, ప్రేమ, పని’ అన్న మూడు మాటలకే పరిమితం చేసుకుంటారు. ఇదే తగినంత సంబాషణ.