పుట:Oka-Yogi-Atmakatha.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

694

ఒక యోగి ఆత్మకథ

భగవదాశీస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్దిమందికోసమని భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసిన పాశ్చాత్యులకు జాతి జీవనాడినీ, కాలం తాకిడికి తట్టుకొంటూ భారతదేశం నిలుపుకొంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్నీ అనుభూతి కావించుకోడానికి అద్వితీయమైన అవకాశం కలిగింది.

మా బృందం మొదటి రోజంతా, కేవలం చూడడంతోనే గడిపింది. వేలకొద్ది యాత్రికులు, పాపపరిహార నిమిత్తం పావనగంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజాపురస్కారాలూ అగ్ని కార్యాలు నిర్వర్తించారు; మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తి పూర్వకంగా కానుకలు సమర్పించారు; ఏనుగులూ, అందంగా అలంకరించిన గుర్రాలూ, మందగొడిగా నడిచే రాజపుటానా ఒంటెలూ బారులు బారులుగా సాగాయి; వాటి వెనక, వెండిబంగారాలతో చేసిన రాజ దండాల్నీ పట్టు ముఖమల్ పతాకాల్నీ ఊపుతూండే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు సాగింది.

గోచీలు మాత్రం పెట్టుకుని ఉన్న తపస్వులు, ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చుని ఉన్నారు; వేడికీ చలికీ తట్టుకోగలిగేందుకు వీలుగా వారు, ఒంటికి బూడిద పూసుకుని ఉన్నారు. వారికి నుదుట ఉన్న చందనపు బొట్టు జ్ఞాననేత్రాన్ని సూచిస్తోంది. తల నున్నగా గీయించుకుని, కాషాయవస్త్రాలు ధరించి, ఒక్కొక్క వెదురుకర్రా భిక్షాపాత్రా చేతపట్టుకున్న సన్యాసులు వేలకొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడూ శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడూ కూడా వాళ్ళ ముఖాలు, సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశించాయి.

అక్కడక్కడ చెట్లకింద, మండుతున్న కొయ్యదుంగల గుట్టలు