పుట:Oka-Yogi-Atmakatha.pdf/727

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

691

తాము పోయిన తరవాత, తమ రెండు ఆశ్రమాల్నీ ఇతర ఆస్తుల్నీ స్వాధీనం చేసుకోడం కోసం తమ బంధువులెవరూ వ్యాజ్యమాడకుండా ఉండేలా కట్టుదిట్టం చెయ్యాలని ఆయన ఆత్రం; ఆ ఆస్తుల్ని కేవలం ధర్మకార్యాలకే వినియోగించేటట్టుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరిక.

“ఈమధ్య గురువుగారు కిద్దర్‌పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి కాని, వెళ్ళలేకపోయారు.” నా సోదరశిష్యుడు అమూల్యబాబు ఒకనాడు మధ్యాహ్నం నాతో అన్నాడు; ఏదో కీడు జరగబోతున్నట్టు నాలో వణుకు పుట్టింది. నేను గుచ్చిగుచ్చి అడిగిన మీదట శ్రీయుక్తేశ్వర్‌గారు ఇలా చెప్పారు, “ఇంక నేను కిద్దర్‌పూర్ వెళ్ళేది లేదు.” ఒక్క క్షణం గురుదేవులు, జడుసుకున్న పసివాడిలా వణికిపోయారు.

(“మహామునుల్లో సైతం, దేహమనే ఇంటిమీద మమకారం, దాని సహజ ప్రకృతినిబట్టి పుట్టి[1] రవ్వంత ఉంటుంది,” అని రాశాడు పతంజలి. మా గురుదేవులు చేసే ప్రసంగాలు కొన్నిటిలో, “చాలా కాలం పాటు పంజరంలో పెట్టి ఉంచిన పక్షి, తలుపు తెరిచినప్పుడు, తనకు అలవాటయిన ఇంటిని విడిచి వెళ్ళడానికి వెనకాడుతుంది,” అంటూండేవారు).

“గురూజీ, అంతమాట అనకండి! అలాటి మాటలు మరెన్నడూ నా దగ్గర అనకండి,” అంటూ ఏడుస్తూ మనవి చేసుకున్నాను.

శ్రీయుక్తేశ్వర్‌గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమయింది. ఎనభై ఒకటో పుట్టినరోజు రాబోతున్నా, ఆయన బాగా దృఢంగా ఉన్నారు.

  1. అంటే, గతంలో పొందిన మరణానుభవాలనే పురాతన మూలాలనుంచి అని అర్థం. [“స్వరసవాహి విదుషో౽పి తథారూఢో౽భినివేశః]. ఈ సూత్రం పతంజలి యోగసూత్రాల్లో 11 : 9 లో వస్తుంది.