పుట:Oka-Yogi-Atmakatha.pdf/726

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

690

ఒక యోగి ఆత్మకథ

ఆయన ముందు నేను మోకరిల్లుతూ ఉండగా ఇలా అన్నారు, “ఇప్పుడిది ‘స్వామి’ అన్న నీ వెనకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది.” ‘పరమహంస జీ’[1] - అన్నది పలకడానికి నా పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాట్లు తలుచుకుని నాలో నేను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాను.

“భూమి మీద ఇప్పుడిక నా పని పూర్తి అయింది; ఇక నువ్వు కొనసాగించాలి,” అన్నారు గురుదేవులు ప్రశాంతంగా. ఆయన కళ్ళు ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉన్నాయి. నా గుండె భయంతో దడదడా కొట్టుకుంటోంది.

“పూరీలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోడానికి ఎవరినయినా పంపు,” అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “నే నంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నువ్వు నీ జీవితనౌకనీ, సంస్థానౌకనీ విజయవంతంగా దైవతీరాలకు చేర్చగలుగుతావు.”

నేను కన్నీళ్ళు కారుస్తూ ఆయన పాదాల్ని చుట్టేసుకున్నాను; ఆయన లేచి ప్రేమపురస్సరంగా దీవించారు.

తరవాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చెయ్యడానికి సంబంధించిన న్యాయశాస్త్రపరమైన వివరాలు నాతో ముచ్చటించారు;

  1. వాళ్ళు సాధారణంగా నన్ను ‘సర్’ అని సంబోధిస్తూ ఈ ఇబ్బంది తప్పించుకున్నారు.