పుట:Oka-Yogi-Atmakatha.pdf/725

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

689

మిలలాడాయి; ఇంగ్లీషులో నా మొదటి ఉపన్యాసం జరగడానికి ముందు ఓడలో నేను పడ్డ అవస్థ తలిచారో ఏమో ఆయన. నా శ్రోతలకూ సోదర శిష్యులకూ ఈ కథ చెప్పి, గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముగించాను.

“అమోఘమైన వారి మార్గదర్శకత్వం నాకు, మహాసముద్రంలో ఓడమీదే కాదు, మహావిశాలమై ఆదరభరితమైన అమెరికాదేశంలో నేనున్న పదిహేనేళ్ళూ ప్రతిరోజూ నాకు లభిస్తూనే ఉంది,” అని ముగించాను.

అతిథులు వెళ్ళిపోయిన తరవాత శ్రీయుక్తేశ్వర్‌గారు, ఒకప్పుడు తమ పక్కలో పడుకొని నిద్రపోవడానికి అనుమతించి (అది కూడా ఒక్కసారే, ఇలాటి ఉత్సవం ఒకటి జరిగిన తరవాత) నన్ను తీసుకు వెళ్ళిన పడగ్గదికే రమ్మని పిలిచారిప్పుడు. ఈరోజు రాత్రి మా గురుదేవులు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు, వారి పాదసన్నిధిలో అర్ధచంద్రాకారంగా కూర్చున్నారు శిష్యులు.

“యోగానందా, నువ్విప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా? రేపు మళ్ళీ ఒక్కసారి రా ఇక్కడికి. నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి.”

మర్నాడు మధ్యాహ్నం, ఆశీఃపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీయుక్తేశ్వర్‌గారు, ‘పరమహంస’[1] అనే ఉన్నత పరివ్రాజక బిరుదం నాకు ప్రసాదించారు.

  1. ‘పరమ’, అత్యున్నత; ‘హంస’ తెల్లటి హంసను సృష్టికర్త అయిన బ్రహ్మకు వాహనంగా చెబుతాయి పురాణాలు. పవిత్రమైన ఈ హంసకు, నీళ్ళు కలిసిన పాలల్లోంచి నీళ్ళను మాత్రం వేరుచేసే శక్తి ఉందని చెబుతారు; అంచేత అది వివేకానికి ప్రతీక అయింది.

    ‘అహం-సః’ (ఉచ్చారణలో, హంస) అంటే, “నేనే ఆయన” అని అర్థం. శక్తిమంతమైన ఈ రెండు సంస్కృత మంత్ర శబ్దాలకూ శ్వాసప్రశ్వాసలతో స్పందక సంబంధముంది. ఆ విధంగా మానవుడు ప్రతి శ్వాసతోనూ, “నేనే ఆయన్ని” అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండానే నొక్కి చెబుతుంటాడు.