పుట:Oka-Yogi-Atmakatha.pdf/722

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 42

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

“గురూజీ, ఈవేళ పొద్దున మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది.”

పండ్లూ గులాబీల సుగంధ భారాన్ని మోసుకొని నే నప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను. శ్రీయుక్తేశ్వర్‌గారు నిర్లిప్తులై చూశారు నావేపు.

“ఏమిటి నీ ప్రశ్న?” తప్పించుకోడానికి చూసినట్టుగా, గది అంతా కలయజూశారు గురుదేవులు.

“గురూజీ, నేను మీ దగ్గరికి హైస్కూలు పిల్లవాడిగా వచ్చాను, ఇప్పుడు నేను పెరిగి పెద్దవాణ్ణయాను; ఒకటిరెండు వెంట్రుకలు కూడా నెరిశాయి. మొదట మనం కలుసుకున్న క్షణంనుంచి ఈనాటివరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిపిస్తూ వస్తున్నప్పటికీ, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అని మీరు అన్నదీ, మనం మొదట కలుసుకున్న రోజున, ఒకే ఒకసారి అన్న సంగతి మీకు గుర్తుందా?” అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయనవేపు చూశాను.

గురుదేవులు చూపు వాల్చుకున్నారు. “యోగానందా, మాటలులేని గుండె చక్కగా పదిలపరిచే స్నిగ్ధభావనల్ని పొడిపొడిగా ఉండే మాటల్లో పెట్టాలా?” అన్నారు.