పుట:Oka-Yogi-Atmakatha.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

51

హరిద్వారం వెళ్ళడానికి బండి ఎక్కాం. మర్నాడు మొగల్ షరాయిలో బండ్లు మారడానికి ప్లాట్‌ఫారం మీద కాసుకొని కూర్చుని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం.

“అమర్, కాసేపట్లో రైల్వే ఉద్యోగులు వచ్చి మనని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వెయ్యవచ్చు. మా అన్నయ్య తెలివిని నేను ఏ మాత్రం తక్కువగా అంచనా వెయ్యడం లేదు. ఫలితం ఏమైనా సరే, నేను మాత్రం అబద్ధం ఆడను,” అన్నాను.

“ముకుందా, నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని. నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వకు- ఉలకకు. పలకకు!”

ఇంతలోనే ఒక యూరోపియన్ అధికారివచ్చి నన్ను నిలదీశాడు. ఒక తంతి కాయితం నా ముందు ఆడించాడు; దాంట్లో విషయం నేను వెంటనే గ్రహించగలిగాను.

“మీరు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోతున్నారా?”

“లేదు!” ప్రశ్నించడానికి అతను ఎన్నుకొన్న మాటలు, నేను గట్టిగా జవాబివ్వడానికి వీలు కలిగించినందుకు నాకు సంతోషమయింది. అయితే ఆచార విరుద్ధమయిన నా ప్రవర్తకు కారణం కోపం కాదు, “దైవం కోసం కలిగిన అత్యధిక నిస్పృహ” అని నాకు తెలుసు.

అప్పుడా ఉద్యోగి అమర్ వేపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యా జరిగిన వాగ్వాదం వింటూంటే, ప్రజ్ఞా ప్రదర్శనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు ఉంది. దాంతో, గంభీరంగా ఉండమని మా వాడిచ్చిన సలహా పాటించడం చాలాకష్టమయిపోయింది.

“మూడో వా డెక్కడ?” కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించేటట్టు అడిగాడాయన.