పుట:Oka-Yogi-Atmakatha.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

677

ఆధునిక మద్రాసు ప్రెసిడెన్సీలో మహాత్మాగాంధీ అహింసా ధర్మాలు మంచి ప్రగతి సాధించాయి. తెల్లటి “గాంధీ టోపీలు” ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దక్షిణ ప్రాంతం మొత్తంమీద మహాత్ముడు, “అంటరానివాళ్ళ” కోసం అనేక దేవాలయ సంస్కరణలూ కులవ్యవస్థా సంస్కరణలు తీసుకువచ్చాడు.

గొప్ప ధర్మశాస్త్రవేత్త అయిన మనువు ఏర్పరిచిన కులవ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలు మెచ్చుకోదగ్గవి. సహజ పరిణామరీత్యా మానవుల్ని నాలుగు గొప్ప వర్గాలుగా వింగడించవచ్చునని ఆయన స్పష్టంగా గమనించాడు: కాయకష్టం చేసి సమాజానికి సేవ చేసేవాళ్ళు (శూద్రులు); ప్రజ్ఞతో, నేర్పుతో వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, ఉద్యోగంవంటి వాటిద్వారా సేవ చేసేవాళ్ళు (వైశ్యులు); పరిపాలన, కార్యనిర్వహణ, రక్షణ దక్షత వంటివిగల పాలకులూ యోధులూ (క్షత్రియులు); చింతనా పరులూ ఆధ్యాత్మికోత్తేజం పొందినవాళ్ళూ దాన్ని అందించేవాళ్ళూ (బ్రాహ్మణులు). “ఎవరయినా ద్విజుడయినదీ కానిదీ నిర్ణయించేది పుట్టుకా కాదు, సంస్కారాలూ కావు, చదువూ కాదు, ఆభిజాత్యమూ కాదు; శీలం, నడవడికా మాత్రమే దాన్ని నిర్ణయించగలవు,” [1]అని చెప్పింది

  1. “ఈ నాలుగు” కులాల్లో ఒక దాంట్లోకి చేర్చడమన్నది, మొదట్లో, మనిషి పుట్టుక మీద ఆధారపడి ఉండేది కాదు; జీవితంలో అతడు సాధించడానికి ఎంచుకున్న లక్ష్యంవల్ల వెల్లడి అయే సహజ శక్తులమీద ఆధారపడి ఉండేది.” అని 1935 జనవరి “ఈస్ట్- వెస్ట్” పత్రికలో ఒక వ్యాసంలో పేర్కోడం జరిగింది. “ఈ లక్ష్యం ఈ కిందివాటిలో ఏదయినా కావచ్చు. (1) ‘కామం’, కోరిక, ఇంద్రియాలే తాననుకొని గడిపే జీవితం (శూద్రదశ), (2) ‘అర్థం’, లాభార్జన చేస్తూనే కోరికల్ని అదుపులో ఉంచుకోడం (వైశ్యదశ), (3) ‘ధర్మం’, స్వయం శిక్షణతోనూ బాధ్యతతోనూ సత్కర్మతోనూ కూడిన జీవితం (క్షత్రియదశ), (4) ‘మోక్షం’, విడుదల, ఆధ్యాత్మికతతోనూ, మతధర్మబోధనతోనూ కూడిన జీవితం (బ్రాహ్మణదశ). ఈ నాలుగు కులాలూ మానవులకు సేవ చెయ్యడానికి ఉపకరించే సాధనాలు ఇవి: (1) శరీరం (2) మనస్సు (3) సంకల్పశక్తి (4) ఆత్మ. “ఈ నాలుగు దశలకూ శాశ్వతగుణాల్లో లేదా ప్రకృతిగుణాల్లో సామ్యం ఉంది. ఆ గుణాలు ఏవంటే, ‘తమస్సు, రజస్సు, సత్త్వం’; అవరోధం, క్రియాశీలత, విస్తరణ; లేదా, ద్రవ్యరాశి, శక్తి, జ్ఞానం. ఆ నాలుగు సహజ కులాలూ గుణాల్నిబట్టి ఈ విధంగా సూచిత మవుతాయి: (1) తమస్సు (అజ్ఞానం), (2) తమస్సు - రజస్సు (అజ్ఞానం, క్రియాశీలతల కలగలుపు), (3) రజస్సు - సత్త్వం (సత్కర్మ, జ్ఞానం కలగలుపు), (4) సత్త్వం (జ్ఞానం). ఈ విధంగా ప్రకృతి, ప్రతి మనిషిలోనూ ఉన్న ఒక గుణానికి గాని రెండు గుణాల కలగలుపుకు గాని ఉన్న ప్రాబల్యాన్ని బట్టి అతనికొక కులాన్ని నిర్దేశిస్తుంది. సహజంగా ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణాలూ వివిధ నిష్పత్తుల్లో ఉంటూనే ఉంటాయి. ఒక మనిషి కులాన్ని లేదా క్రమోన్నత పరిణామ హోదాను గురువు సరిగా నిర్ధారణ చెయ్యగలుగుతాడు.

    “అన్ని జాతులూ అన్ని దేశాలూ, సిద్ధాంతపరంగా కాకపోయినా ఆచరణలోనైనా, కులవ్యవస్థా లక్షణాల్ని కొంతవరకు పాటిస్తూనే ఉంటాయి. స్వేచ్ఛ అనే గొప్ప లైసెన్సు ఉన్నచోట, ముఖ్యంగా సహజకులాల్లో విపరీత శ్రేణుల మధ్య జరిగే అంతర్వివాహాల్లో, క్రమక్రమంగా జాతి క్షీణించిపోతూ, చివరికి నశిస్తుంది. ‘పురాణ సంహిత’లో, అటువంటి సంగమాలవల్ల కలిగిన సంతానాన్ని కంచరగాడిద వంటి గొడ్డుబోతు సంకరజాతి పశువుతో పోల్చడం జరిగింది; కంచరగాడిద సంతానాన్ని కనలేదు. చివరికి, కృత్రిమ జాతులు అంతరించి పోతాయి. ఎన్నో గొప్పగొప్ప జాతులు నామరూపాలు లేకుండా నశించిపోయిన సంగతి, చరిత్రలో అనేక ప్రమాణాలవల్ల రుజువవుతుంది. ప్రాచీనమైన ఇతర జాతులు అనేకం సంపూర్ణంగా అదృశ్యమైపోగా, జాతి స్వచ్ఛతను కాపాడి, అనేక వేల రకరకాల పరిస్థితుల్లో దాని మనుగడను సురక్షితంగా సాగనిస్తూ విశృంఖలతను అదుపులో పెట్టి మహామేధావుల్ని సృష్టించిన ప్రతిష్ఠ భారతదేశ కులవ్యవస్థకు మాత్రమే దక్కింది.