పుట:Oka-Yogi-Atmakatha.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

675

మరో గ్రంథంలో ఇలా ఉంది: “భారతీయులు అన్యాయపు వడ్డీ వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టనూ పెట్టరు, అప్పు తీసుకునేటప్పుడు లాంఛనరూపమైన ఏర్పాట్లు చేసుకోనూ చేసుకోరు. తప్పు చెయ్యడం కాని, దాన్ని సహించడం కాని భారతీయుల వ్యవహార రూఢికి విరుద్ధం. అంచేత వాళ్ళు కాంట్రాక్టులూ (ఒడంబడికలు) చేసుకోరు, జామీన్లూ అడగరు.” జబ్బులు నయంచెయ్యడమన్నది సాదాగా, సహజమైన రీతుల్లో జరిగేదని చెబుతారు. “మందుల వాడకం కన్న పథ్యం చెయ్యడం వల్ల జబ్బులు నయమవుతున్నాయి. మలాములు, పాలాస్త్రి పట్టీలు ఎక్కువగా వాడే నివారణోపాయాలు. తక్కిన వాటినన్నిటినీ హానికరంగా భావిస్తారు.” యుద్ధంలో పాల్గోడం, యోద్ధకులజులైన క్షత్రియులకే పరిమితమయింది. “పొలంలో పనిచేసే రైతుకు శత్రువు హానిచెయ్యడు; ఆ వర్గంవాళ్ళను ప్రజాహితకారులుగా పరిగణించి వాళ్ళకు ఏ హానీ కలక్కుండా కాపాడ్డమే దానికి కారణం. ఆ విధంగా భూమి, ఎలాటి విధ్వంస చర్యకూ గురికాకుండా ఉండి, భారీ ఎత్తున పంటలు పండిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కావలసిన అవసర వస్తువుల్ని ప్రజలకు అందిస్తుంది.”

మైసూరులో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గుళ్ళు, దక్షిణ భారతదేశంలోని అనేక మంది సాధువుల్ని అనుక్షణం గుర్తుకు తెస్తాయి. వారిలో ఒకరు, తాయు మణవార్, మన కొక సవాలుగా ఈ కింది పద్యం రాశాడు: