పుట:Oka-Yogi-Atmakatha.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

669

అతడు చూపిన గాఢమైన ఆసక్తి; అటువంటివాళ్ళు అప్పుడప్పుడు అతనికి తారసపడుతూ ఉండేవారు, లేదా అతడే గాఢమైన ఉత్సుకతతో వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఈ మాసిడోనియా యోధుడు ఉత్తర భారతంలోని తక్షశిలకు చేరిన కొత్తలో, తక్షశిలలో గొప్ప సన్యాసిగా పేరుపొందిన దండామిస్‌ను తీసుకురమ్మని ఓనెసికృతోస్ (డయోజినస్ స్థాపించిన హెలినిక్ మాతానుయాయి) ను పంపించాడు.

“విజయీభవ, బ్రాహ్మణ్యగురూత్తమా!” అన్నాడు ఓనెసికృతోస్, దండామిస్‌ను ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకొని, “మహాబల సంపన్నుడైన జియిస్ దేవుడి కుమారుడూ మానవమాత్రులందరికీ సర్వేశ్వరుడూ అయిన అలెగ్జాండరు మిమ్మల్ని తన సన్నిధికి రమ్మంటున్నాడు. మీరుకనక మన్నిస్తే మీకు గొప్ప కానుకలిచ్చి సత్కరిస్తాడు; కాదంటే మీకు శిరశ్ఛేదన విధిస్తాడు!” అన్నాడు.

నిర్బంధ ధోరణిలో ఉన్న ఈ ఆహ్వానాన్ని, ప్రశాంతంగా అందుకొన్నాడు ఆ యోగి; అందుకొని, “తన పత్రశయ్యమీదినుంచి తల ఎత్తేపాటి ప్రయత్నం కూడా చెయ్యలేదు.”

“అలెగ్జాండరు జియిస్ కుమారుడయితే, నేనూ ఆయన కుమారుణ్ణే” అన్నాడాయన. “నాకున్నదాంతో నేను తృప్తిగానే ఉన్నాను కనక, అలెగ్జాండరు దేదీ నాకు అక్కర్లేదు. అతను మనుషుల్ని వెంట వేసుకుని భూమిమీదా సముద్రంమీదా వృథాగా తిరగటమేగాక, ఆ తిరుగుళ్ళకు అంతు తెలియకుండా ఉన్నట్టు కనిపిస్తోంది.”

“వెళ్ళి అలెగ్జాండరుకు చెప్పు - సర్వేశ్వరుడైన భగవంతుడెప్పుడూ అవమాన దోషానికి కర్త కాడనీ కాంతికి, శాంతికి, జీవానికి, జలానికి, మానవ దేహానికి, ఆత్మకు కర్త అనీ చెప్పు; మరణం మానవులందరికీ