పుట:Oka-Yogi-Atmakatha.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

658

ఒక యోగి ఆత్మకథ

రాంచీలో మాదిరిగా ఆశ్రమవాస, యోగసాధన అవకాశాలు గల బ్రాంచి హైస్కూళ్ళు స్థాపించడం జరిగింది; అవి ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి. అవి ఏవంటే: మగపిల్లల కోసం లఖన్‌పూర్‌లో ఉన్న ‘యోగదా సత్సంగ విద్యాపీఠం,’ ఇస్మాలీ ఛక్‌లో ఉన్న ‘యోగ విద్యాలయం,’ ఆశ్రమం – ఇవి పశ్చిమ బెంగాల్లో పురులియా, మిడ్నపూర్ జిల్లాల్లో ఉన్నాయి.[1]

1938 లో దక్షిణేశ్వరంలో గంగానదికి ఎదురుగా రాజప్రసాదం లాంటి భవనంలో యోగదా[2] మఠాన్ని స్థాపించడం జరిగింది. కలకత్తాకు ఉత్తరాన చాలా కొద్దిమైళ్ళ దూరంలోనే ఉన్న ఈ ఆశ్రమం, నగరవాసులకు శాంతి నిలయంగా ఉపకరిస్తుంది.

  1. ఉత్తరోత్తరా, మగపిల్లలకూ ఆడపిల్లలకూ కూడా ఉపకరించే విధంగా అనేక యోగదా విద్యాసంస్థలు దేశంలో చాలా చోట్ల ఏర్పడి, ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి. ఈ సంస్థలు కిండర్ గార్టెన్ స్థాయినించి కళాశాల స్థాయివరకు ఉన్నాయి. (ప్రచురణకర్త గమనిక).
  2. ‘యోగదా’ శబ్దం యోగ, దా అన్న రూపాలతో ఏర్పడింది. యోగమంటే కలయిక, సామరస్యం, సంతులనం; దా అంటే ఇచ్చేది. ‘సత్సంగ’ శబ్దంలో సత్ అంటే సత్యం; సంగమంటే స్నేహం. ‘యోగదా’ శబ్దం, 1916లో పరమహంస యోగానందగారు పెట్టిన పేరు; మానవ శరీరాన్ని, విశ్వమూలశక్తి నుంచి తీసుకొనే శక్తితో తిరిగి నింపే విధానాల్ని ఆయన కనిపెట్టినప్పుడు రూపొందించిన పేరు. శ్రీయుక్తేశ్వర్‌గారు తమ ఆశ్రమ వ్యవస్థకు ‘సత్సంగం’ అని పేరు పెట్టారు; ఆయన శిష్యులు పరమహంస యోగానందగారు సహజంగా ఆ పేరే అట్టే పెట్టాలనుకున్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, చిరస్థాయిగా నిలిచి ఉండేటందుకుగాను రూపొందించిన, లాభాసక్తి లేని సంస్థ. ఆ పేరుకింద యోగానందగారు భారతదేశంలో తమ కృషినీ తాము నెలకొల్పిన సంస్థల్నీ రిజిస్టర్ చేయించారు. వాటి పాలన వ్యవహారాల్ని, పశ్చిమ బెంగాలులో దక్షిణేశ్వరంలో ఉన్న యోగదామఠంలో ఒక పాలక మండలి సమర్థంగా నిర్వహిస్తోంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వై. ఎస్. ఎస్. ధ్యాన కేంద్రాలు అనేకం ఇప్పుడు వర్ధిల్లుతున్నాయి.

    పాశ్చాత్య దేశాల్లో, సంస్కృత శబ్దాలు లేకుండా ఉండడం కోసం యోగానందగారు, తమ సంస్థను సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పేర రిజిస్టర్ చేయించారు. శ్రీశ్రీ దయామాత 1955 నుంచి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌లకు అధ్యక్షురాలుగా ఉంటున్నారు. (ప్రచురణకర్త గమనిక).