పుట:Oka-Yogi-Atmakatha.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశానికి తిరిగి రాక

655

విద్యావేత్తలతోనూ ఇంటర్వ్యూలు జరిగాయి. యువకుడైన కాశింబజారు మహారాజుతో చాలా సేపు మాట్లాడాను. ఆర్థిక సహాయంకోసం నాన్న గారిని అర్థించాను. ఇక చూడండి! కదలబారుతున్న రాంచీ విద్యాలయం పునాదులు చక్కబడ్డం మొదలయింది. సరయిన సమయంలో, మా అమెరికా విద్యార్థుల నుంచి కూడా విరాళాలు వచ్చాయి.

నేను భారతదేశానికి వచ్చిన కొన్ని నెల్లలోనే, రాంచీ విద్యాలయం చట్టబద్ధంగా నమోదు కావడం చూసి ఆనందించాను. చిరస్థాయిగా ఒక యోగవిద్యాకేంద్రాన్ని నెలకొల్పాలన్న నా జీవిత స్వప్నం సఫల మయింది. ఆ మహదాశయమే నన్ను, 1917 లో ఏడుగురు విద్యార్థులతో చిన్నగా మొదలుపెట్టడానికి పురికొల్పింది.

యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అన్న ఈ బడి, ప్రాథమిక భాషాబోధన స్థాయిలోనూ ఉన్నత పాఠశాలా విషయస్థాయిలోనూ జరిగే తరగతులు ఆరుబయట నడుపుతుంది. ఆశ్రమవాసి విద్యార్థులూ పగటి విద్యార్థులూ కూడా ఏదో ఒక రకం వృత్తివిద్యా శిక్షణ పొందుతారు.

స్వయంనిర్ణయాధికారం గల సంఘాల ద్వారా, విద్యార్థులే తమ కార్యకలాపాల్ని క్రమబద్ధం చేసుకుంటారు. మాస్టరును బోల్తా కొట్టించడ మంటే సరదాపడే పిల్లకాయలు, తమతోటి విద్యార్థులు పెట్టే కట్టుబాట్ల నయితే సంతోషంగా అంగీకరిస్తారన్న సంగతి నేను, నా ఉపాధ్యాయ వృత్తిలో చాలా తొలిరోజుల్లోనే కనిపెట్టాను. ఎన్నడూ ఆదర్శ విద్యార్థిని కాని నేను, కుర్రకారు కూతలకూ వాళ్ళ చిక్కులకూ అన్నిటికీ వెంటనే సానుభూతి చూపిస్తాను.

ఆటల్నీ పోటీల్నీ ప్రోత్సహించడం జరిగింది; హాకీ, ఫుట్‌బాల్ ఆటల అభ్యాసంతో మైదానాలు దద్దరిల్లుతూ ఉంటాయి. రాంచీ విద్యార్థులు