పుట:Oka-Yogi-Atmakatha.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

ఒక యోగి ఆత్మకథ

మనస్సును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరపురాని ఆ రోజు, అపశకునంలాంటి వానను వెంటబెట్టుకొని వచ్చింది. రోడ్డు మీద బండిచక్రాల చప్పుడు వినిపించింది. అమర్ వచ్చేశాడని నేను, గబగబా ఒక దుప్పటీ, చెప్పుల జోడూ, రెండు అంగోస్త్రాలూ, ఒక జపమాలా, లాహిరీ మహాశయుల ఫొటో, భగవద్గీత పుస్తకమూ కలిపి మూటకట్టి మా మూడో అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేశాను. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్కనుంచే వెళ్ళిపోయాను. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడు.

“ఏమిటోయ్ సంబరం?” అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏ మాత్రం తొణక్కుండా ఆయనవేపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. నా మూట తీసుకొని, పన్నాగానికి కావలసినంత జాగ్రత్తా పాటిస్తూ, వెళ్ళి అమర్‌ని కలుసుకొన్నాను. అక్కణ్ణించి మేము చాందినీ చౌక్ అనే బజారుకు వెళ్ళాం. ఇంగ్లీషువాళ్ళు వేసుకొనే బట్టలు కొనుక్కోడం కోసమని మేము, మావాళ్ళు సాదరు ఖర్చుల కిచ్చిన డబ్బులు కొన్ని నెలలపాటు కూడబెట్టుకొంటూ వచ్చాం. మా అన్నయ్య తెలివయినవాడు; చాలా సులువుగా, మా మీద డిటెక్టివ్ పని చెయ్యగలడు. ఈ సంగతి తెలిసి మేము, యూరోపియన్ వేషాలు వేసుకొని అతని కన్ను కప్పాలని అనుకొన్నాం.

స్టేషనకు వెళ్ళే దారిలో మేము, మా చుట్టం- జ్యోతిస్ ఘోష్ కోసం ఆగాం; అతన్ని నేను జతీన్‌దా అనే పిలిచేవాణ్ణి. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు; హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకొన్నాడు అతను. మా ఎత్తు బాగా పారిందని మురిసి పోయాం! గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఆవరించింది.