పుట:Oka-Yogi-Atmakatha.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశానికి తిరిగి రాక

653

మేము ఆయన పాదాల ముందు వాలి, ప్రణామం[1]తో సెలవు తీసుకొన్నాం; ఆ పవిత్ర సమాగమం తాలూకు చిరస్మరణీయమైన అనుభూతితో కలకత్తాకు బయలుదేరాం. నేను ముఖ్యంగా, పరమగురువుల గురించిన బాహ్య విషయవర్ణనలే చేసినప్పటికీ, ఆయన ఆధ్యాత్మిక మహిమ నా కెప్పుడూ స్పృహలోనే ఉంది. వారి శక్తి నాకు అనుభూతమయింది; ఆ అనుభూతిని దివ్యమయిన ఆశీస్సుగా ఎప్పటికీ నిలుపుకొంటాను.”

అమెరికానుంచి, యూరప్‌నుంచి, పాలస్తీనానుంచి నేను శ్రీయుక్తేశ్వర్‌గారి కోసం చాలా కానుకలు తెచ్చాను. వాటిని ఆయన చిరునవ్వుతో స్వీకరించారు; కాని ఏమీ వ్యాఖ్యానించలేదు. నా కోసమని నేను జర్మనీలో గొడుగూ చేతికర్రా కలిసిన బెత్తం ఒకటి కొనుక్కున్నాను. ఇండియాలో, ఆ బెత్తం గురుదేవులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను.

“నిజంగా ఈ కానుకను మెచ్చుకుంటాను” అంటూ గురుదేవులు, ఆనవాయతీలేని ఈ వ్యాఖ్య చేస్తూ, ఆప్యాయమైన అవగాహనతో కళ్ళు నా వేపు తిప్పారు. నే నిచ్చిన బహుమతులన్నిటిలోకీ, సందర్శకులకు చూపించడానికి ఆయన ఎన్నుకున్నది ఈ చేతికర్ర.

“గురుదేవా, కూర్చునే గదికోసం కొత్త తివాసీ ఒకటి తెప్పించడానికి నాకు అనుమతి ఇయ్యండి.” శ్రీయుక్తేశ్వర్‌గారి పులిచర్మం, చిరుగుల కంబడి మీద పరిచి ఉన్న సంగతి అంతకుముందు గమనించాను.

“నీకంత సరదాగా ఉంటే అలాగే కానియ్యి.” గురుదేవుల గొంతులో ఉత్సాహమేమీ లేదు, “చూడు, నా పులిచర్మం చక్కగా, శుభ్రంగా

  1. అంటే, “సంపూర్ణమైన నమస్కారం.” సంస్కృతంలో ‘నమ్’ అనే ధాతువుకు మొక్కడం లేదా వంగడం అనీ, ‘ప్ర’ అనే ఉపసర్గకు ‘సంపూర్ణంగా’ అని అర్థాలు; వాటితో వచ్చిన పదమిది.