పుట:Oka-Yogi-Atmakatha.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

652

ఒక యోగి ఆత్మకథ

ఒక బాలశిష్యుడు చటుక్కున వచ్చి ఆయనకు కావలసింది కనుక్కునేవాడు. అక్కడి కుర్రవాళ్ళలో ప్రఫుల్ల[1] అనే సన్నటి కుర్రవాడు నన్ను బాగా ఆకర్షించాడు; భుజాల మీదికి వేలాడే నల్లటి జుట్టూ, గుచ్చిగుచ్చి చూసే కాంతిమంతమైన రెండు కళ్ళూ, దివ్యమైన దరహాసమూ అతనివి. అతను చిరునవ్వు నవ్వినప్పుడు, కళ్ళు మెరుస్తూ, మూతి చివరలు పైకి లేస్తుంటే, సంజె వెలుగులో పొడుస్తున్న చుక్కలూ నెలవంకా లాగ ఉంటాయి.”

“తమ ‘శిష్యుడు’ తిరిగి వచ్చిన సందర్భంగా స్వామి శ్రీయుక్తేశ్వరులకు కలిగిన ఆనందం సహజంగా గాఢమైనది (తమ ‘శిష్యుడి శిష్యు’ణ్ణి అయిన నా గురించి కూడా ఆయన కొంతమట్టుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనబడింది). అయినప్పటికీ, పరమగురువుల స్వభావంలో జ్ఞాన విషయానికున్న ప్రాబల్యం, అనుభూతిని బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఆటంకపరుస్తుంది.”

“యోగానందగారు ఆయనకు కొన్ని కానుకలు సమర్పించారు; శిష్యుడు తన గురువు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అలా కానుకలు సమర్పించడం ఆచారం కనక. తరవాత కొంతసేపటికి మేము భోజనాలకు కూర్చున్నాం; చక్కగా వండిన సాదా భోజన మది. వంటకాలన్నీ కూరగాయలతో అన్నంతోనూ తయారయినవే. నేను భారతీయాచారాలు కొన్ని పాటిస్తున్నందుకు శ్రీయుక్తేశ్వర్‌గారు ఎంతో ముచ్చటపడ్డారు; మాట వరసకు, ‘చేత్తో తినడం.’ ”

“కొన్ని గంటల సేపు బెంగాలీ భాషలో, సంభాషణలు సాగి, స్నిగ్ధమైన చిరునవ్వులూ ప్రసన్నమైన చూపులూ ప్రసరించిన తరవాత,

  1. గురుదేవుల దగ్గరికి తాచుపాము ఒకటి వచ్చినప్పుడు అక్కడున్న కుర్రవాడు ప్రఫుల్లుడే (12 అధ్యాయం చూడండి).