పుట:Oka-Yogi-Atmakatha.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశానికి తిరిగి రాక

647

హౌరా స్టేషన్‌లోకి మేము చేరేసరికి మమ్మల్ని అభినందించడానికి జనం విరివిగా గుమిగూడినందువల్ల, కొంత సేపటిదాకా మేము బండిలోంచి దిగడమే సాధ్యం కాలేదు. కాశింబజారు యువ మహారాజు, మా తమ్ముడు విష్ణు స్వాగత సంఘానికి నాయకత్వం వహించారు. మా బృందానికి స్వాగతం ఇవ్వడంలో వారు చూపించిన ఆప్యాయత, ఘనత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి.

కార్లూ మోటారు సైకిళ్ళూ బారుగా ముందు సాగుతూ ఉండగా, మృదంగాలూ శంఖాలూ ఆనందధ్వానాలు కావిస్తూ ఉండగా మిస్ బ్లెట్ష్, శ్రీరైట్, నేనూ ఆపాదమస్తకం పూలదండలతో నిండిపోయి, మెల్లగా మా నాన్నగారి ఇంటికి సాగాం.

వృద్ధులైన మా నాన్నగారు, చనిపోయినవాడు మళ్ళీ బతికి వచ్చినప్పుడు హత్తుకునేటంత గాఢంగా నన్ను కౌగలించుకున్నారు; ఆనందంతో నోట మాటలేకుండా ఒకరినొకరం చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయాం. తమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, మామయ్యలు, అత్తలు, బావలు, విద్యార్థులు, చిరకాల మిత్రులు నా చుట్టూ మూగేశారు; మాలో చెమ్మగిలని కన్ను ఒక్కటీ లేదు. నా జ్ఞాపకాల పురావస్తు భండారంలోకి చేరిపోయిన, ఆ ప్రేమపూర్వక పునస్సమాగమ దృశ్యం మరవరానిదై నా గుండెలో స్పష్టంగా నిలిచిపోతుంది. శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకున్న సందర్భం వర్ణించడానికి నాకు మాటలు చాలవు; నా కార్యదర్శి చేసిన కింది వర్ణనతోనే సరిపెట్టుకుందాం:

“ఈ రోజు, గొప్ప ఉత్కంఠతో నిండిపోయి, యోగానందగారిని కారులో కలకత్తా నుంచి శ్రీరాంపూర్ తీసుకువెళ్ళాను,” అని రాసుకున్నాడు. శ్రీరైట్, తన ప్రయాణం డైరీలో.

“వింతవింత దుకాణాలు దాటి ముందుకు వెళ్ళాం. వాటిలో ఒకటి,