పుట:Oka-Yogi-Atmakatha.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 40

భారతదేశానికి తిరిగి రాక

కృతజ్ఞతాపూర్వకంగా భారతదేశపు భవ్య వాయువును మళ్ళీ శ్వాసిస్తున్నాను. మా ఓడ ‘రాజపుటానా,’ 1935 ఆగస్టు 22 తేదీనాడు విశాలమైన బొంబాయిరేవుకు చేరి నిలిచింది. ఓడ దిగిన, మొదటి రోజు సైతం, నిర్విరామ కార్యకలాపాలతో నిండబోయే పై సంవత్సరం అనుభవాన్ని ముందే రుచి చూపించింది. పూలమాలలతోనూ స్వాగతాభినందనలతోనూ రేవు దగ్గర కూడారు; మరి కాసేపట్లో తాజనుహల్ హోటల్లో మా గదికి, పత్రికా విలేఖరులూ ఫొటోగ్రాఫర్లూ ప్రవాహంలా వచ్చారు.

బొంబాయినగరం నాకు కొత్త. పాశ్చాత్యదేశాలనుంచి వచ్చిన అనేక నవకల్పనలతో, శక్తిమంతంగా ఆధునికం అయిన నగరంలా కనిపించింది. విశాల వీధుల వెంబడి వరసగా తాటిచెట్లు నిలిచి ఉన్నాయి; బ్రహ్మాండమైన ప్రభుత్వ భవనాలు ఆసక్తి కలిగించడంలో పురాతన దేవాలయాలతో పోటీ పడుతున్నాయి. దృశ్యావలోకనానికి వినియోగించింది తక్కువ కాలమే అయినా, మా గురుదేవుల్నీ ఇతర ఆత్మీయుల్నీ

చూడాలన్న తహతహతో నాలో ఆదుర్దా కలిగింది. ఫోర్డు కారును సామాను రైలు పెట్టెలోకి ఎక్కించి, త్వరలోనే మేము ముగ్గురం కలకత్తా వేపు పోయే రైలులో వడివడిగా సాగిపోయాం.[1]

  1. వార్ధాలో మహాత్మాగాంధీని చూడ్డానికని దేశమధ్యంలో ఉన్న మధ్య పరగణాల్లో మా ప్రయాణం ఆపాం. ఆ రోజుల్ని గురించి 44 అధ్యాయంలో వివరించడం జరిగింది.