పుట:Oka-Yogi-Atmakatha.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

645

ఖైదుకొట్టు చూశాం. ప్రతిచోటా, తమ కల్పనలను చలవ రాతిమీద సాక్షీభూతం కావించిన ప్రాచీన గ్రీకుల కళాకౌశలానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు.

సూర్యకాంతిలో ఉజ్జ్వలమైన మధ్యధరాసముద్రంమీద ఓడలో ప్రయాణంచేసి పాలస్తీనాలో దిగాం. ఆ పవిత్ర భూమిలో రోజుల తరబడి తిరుగుతూ, నా యాత్రకున్న విలువను బాగా తెలుసుకున్నాను. సున్నితమైన హృదయం గలవాడికి, క్రీస్తు మహిమ పాలస్తీనా అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది. బెత్లెహాములో, గెత్సెమేన్‌లో, కాల్వరీలో, పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర, జోర్డాన్ నదీతీరంలో, గలిలీ సముద్రతటంలో భక్తి పురస్సరంగా, నేను ఆయన పక్కనే నడిచాను.

మా బృందం, బర్త్ మాంజర్ (పుట్టు గోలెం), యోసేపు వడ్రంగం కొట్టు, లాజరు గోరీ, మార్తా మేరీల ఇల్లు, కడపటి రాత్రి విందు జరిగిన హాలు సందర్శించింది. పురాతన చరిత్ర మా కళ్ళముందు బహిర్గత మయింది; దృశ్యం తరవాత దృశ్యంగా, యుగయుగాంతరాలు దర్శించడం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్యనాటకాన్ని నేను దర్శించాను.

తరవాత ఈజిప్టు చేరాం; ఆధునికమైన కెయిరోసూ పురాతనమైన పిరమిడ్లనూ చూశాం. ఆ తరవాత ఓడలో, దీర్ఘమైన ఎర్ర సముద్రం దిగువకు, ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేశాం; చివరికి అదుగో, భారతదేశం!