పుట:Oka-Yogi-Atmakatha.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

644

ఒక యోగి ఆత్మకథ

ఆ మర్నాడు మా బృందం దక్షిణ దిశకు సాగింది. రైలుబళ్ళ మీద ఆధారపడక్కర్లేకుండా, పల్లెపట్టుల్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా ఫోర్డు కారును ఆపగలిగినందుకు సంతోషించాం. జర్మనీ, హాలండ్, ఫ్రాన్స్, స్విస్ ఆల్ప్స్ గుండా మేము సాగించిన యాత్రలో ప్రతిక్షణం మమ్మల్ని ఆనందభరితుల్ని చేసింది. ఇటలీలో అసిసీకి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం; వినయస్వరూపుడయిన సెంట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటుచేసుకున్నదది. గ్రీసుతో మా యూరప్ పర్యటన ముగిసింది; అక్కడ మేము ఎథీనియన్ దేవాలయాలు సందర్శించాం; సాధుసత్తముడైన సోక్రటీస్,[1] తన ప్రాణం తీసే విషం తాగిన

  1. సోక్రటీస్‌కూ ఒక హిందు మునికి జరిగిన వాగ్వాదాన్ని, గురించి ‘యూసేబియన్’ లో ఒకచోట ఇలా చెప్పడం జరిగింది: “అరిస్టోజినస్ అనే సంగీతకారుడు భారతీయుల్ని గురించి ఈ కింది కథ చెప్పాడు. భారతీయుల్లో ఒకడు ఏథెన్స్‌లో సోక్రటీస్‌ను కలుసుకుని తన తత్త్వం విషయవిస్తృతి ఏమిటని అడిగాడు. ‘మానవ దృగ్విషయాల అనుశీలన’ అని జవాబిచ్చాడు సోక్రటీసు. దీని కా భారతీయుడు విరగబడి నవ్వాడు. “దివ్య దృగ్విషయాల్ని ఎరగనప్పుడు, మానవ దృగ్విషయాల్ని ఎలా అనుశీలన చెయ్యగలడు మనిషి?” అన్నాడతను.

    పాశ్చాత్య తత్త్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీక్ ఆదర్శం: ‘‘మనిషి, నువ్వు స్వయంగా తెలుసకో” (Man, know thyself) అని, హిందువు అనేది: “మనిషీ, నీ ఆత్మను తెలుసుకో” (Man, know thy self) అని. “నేను ఆలోచిస్తాను, కనక నేను ఉన్నాను,” అంటూ డెకార్ట్ (Descartes) అన్న వాక్యం తాత్వికంగా చెల్లదు. తార్కిక వివేచన శక్తులు, మానవుడి పరమ తత్త్వాన్ని వెల్లడించలేవు. మానవ మనస్సు, అది గుర్తించే పరిణామశీల ప్రపంచం లాగే శాశ్వతపరివర్తనలో ఉన్నది; అంతిమ నిర్ణయాల్ని అది అందించలేదు.

    బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు. దేవుణ్ణి అన్వేషించేవాడే ‘విద్య’ను నిజంగా ప్రేమించేవాడు; విద్య అంటే, మార్పుచెందని సత్యం. తక్కినదంతా ‘అవిద్య’; అంటే సాపేక్ష జ్ఞానం.