పుట:Oka-Yogi-Atmakatha.pdf/675

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

639

“థెరిసాతో సహా మేము చాలామందిమి, ప్రకృతి దృశ్యాలు చూడ్డంకోసం తరచుగా జర్మనీ అంతటా రోజుల తరబడి తిరుగుతూ ఉంటాం,” అన్నాడాయన. “కొట్టవచ్చేటట్టు కనిపించే భేదం ఏమిటంటే - మే మందరం రోజుకు మూడేసిసార్లు భోజనాలు చేస్తూ ఉంటే, థెరిసా ఏమీ తినదు. అలసట అన్నదే అంటనట్టు గులాబీ పువ్వులా తాజాగా ఉంటుంది. మే మందరం ఆకళ్ళతో నకనకలాడుతూ, చొరబడ్డానికి దారి పక్క హోటళ్ళ కోసం చూస్తూ ఉంటే, థెరిసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది.”

ఆ ప్రొఫెసరుగారు, ఆసక్తి కలిగించేటటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు. “థెరిసా తిండి తినదు కనక, ఆమె పొట్ట అక్కళించుకుపోయి ఉంటుంది. ఆమెకు మలమూత్ర విసర్జనలు లేవు. కాని ఆమెలో చెమట గ్రంథులు మాత్రం పనిచేస్తున్నాయి; చర్మం ఎప్పుడూ మృదువుగా, దృఢంగా ఉంటుంది.”

మే మింక సెలవు తీసుకునే సమయంలో, థెరిసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలన్న కోరిక వెల్లడించాను.

“సరే, వచ్చే శుక్రవారం కానర్‌స్రాత్‌కు రండి,” అన్నదామె సౌహార్దంతో. “బిషప్ మీకు అనుమతి పత్రం ఇస్తారు. మీరు నా కోసం వెతుక్కుంటూ ఐక్‌స్టాట్ దాకా వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం.”

థెరిసా నా చేతుల్ని మెల్లగా, చాలాసార్లు ఊపి, మా బృందంతోబాటు వీథి గుమ్మం దాకా వచ్చింది. శ్రీ రైట్, కారులో అమర్చి ఉన్న రేడియో మీట తిప్పాడు. ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించింది. ఇక కుర్రవాళ్ళు తొంబలు తొంబలుగా పోగవడంతో