పుట:Oka-Yogi-Atmakatha.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

622

ఒక యోగి ఆత్మకథ

“అది నా మానవ వృక్షం.” లూథర్‌గారు ఆ అమ్మాయివేపు ఆప్యాయంగా చెయ్యి ఊపారు. “ఇప్పుడు నేను మానవజాతిని బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను. దాని అత్యున్నత ప్రయోజనాలు నెరవేరడానికి కావలసిన వల్లా - ప్రేమ, విశాలమైన ఆరుబయలువల్ల కలిగే ప్రకృతిసహజమైన లాభాలు, తెలివిగా అంటుగట్టడం, ఎంపిక. ఒక్క నా జీవితకాలంలోనే, వృక్షపరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతి గమనించానంటే, ప్రపంచంలో పిల్లలకు, సాదాగానూ హేతుబద్ధంగానూ జీవించడానికి సంబంధించిన నియమాలు కనక నేర్పితే, ఆరోగ్యవంతమూ సుఖవంతమూ అయిన ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురుచుస్తూ ఉంటాను. మనం ప్రకృతి దగ్గరికీ ప్రకృతిదైవం దగ్గరికీ తప్పకుండా తిరిగి వెళ్ళాలి.”

“లూథర్‌గారూ, ఆరుబయటి తరగతులూ ఆనందమూ నిరాడంబరతా గల వాతావారణమున్న మా రాంచీ విద్యాలయాన్ని చూస్తే మీరు సంతోషిస్తారు.”

నా మాటలు, బర్బాంక్‌గారి హృదయాన్ని కదిలించాయి. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం - చిన్నపిల్లల విద్య, లోతయిన, ప్రశాంతమైన ఆయన కళ్ళలో ఆసక్తి తొణికిసలాడుతూ ఉండగా, నా మీద ప్రశ్నల వర్షం కురిపించారాయన.

చివరికి ఆయన ఇలా అన్నారు: “స్వామీజీ, మీ విద్యాలయం లాంటివే ముందు యుగాలకొక ఆశారేఖ. పిల్లల్ని ప్రకృతినుంచి విడ దీసేసి, వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన, మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలపరం పుడుతుంది. ఆచరణాత్మకమైన మీ విద్యాదర్శాలతో నేను మనఃపూర్తిగా ఏకీభవిస్తున్నాను.”