పుట:Oka-Yogi-Atmakatha.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గులాబీలమధ్య సాధువు, లూథర్ బర్బాంక్

621

దగ్గరలో ఉన్న ఒక పనివాడు, కొన్ని ఆకులు నాకు తుంచి ఇవ్వడానికి తయారయాడు, బర్బాంక్ అతన్ని ఆపారు.

“స్వామివారి కోసం నేనే వాటిని తుంచి ఇస్తాను.” మూడు ఆకులు నాకు ఇచ్చారు. తరవాత వాటిని నాటాను. అది క్రమంగా పెద్ద తోటగా వృద్ధి అవుతుంటే చూసి ఎంతో ముచ్చటపడ్డాను.

తాము సాధించినవాటిలో, చెప్పుకోదగ్గ మొదటి విజయం, పెద్దరకం బంగాళాదుంప అని చెప్పారు, ఆ మహా ఉద్యానశాస్త్రవేత్త, ఆ బంగాళాదుంప ఇప్పుడు ఆయన పేరుతోనే ప్రసిద్ధికెక్కింది. అకుంఠిత ప్రతిభా సంపత్తితో ఆయన, ప్రకృతిసిద్ధంగా ఉన్న మొక్కల్ని అంటు గట్టి మెరుగుపరిచి, కొన్ని వందల రకాలు ప్రపంచానికి అందించారు - టమాటా, మొక్కజొన్న, గుమ్మడికాయవంటి కూరగాయలు (స్క్వాష్), చెర్రీలు, రేగిపళ్ళు, నెక్టారైన్లు, బేరిపళ్ళు, గసగసాలు, లిల్లీలు, గులాబీలు మొదలైనవి ఆయన రూపొందించిన కొత్త బర్బాంక్ రకాలు

లూథర్‌గారు నన్ను, ‘ప్రసిద్ధమైన ఆక్రోటు (వాల్‌నట్) చెట్టు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే నేను కెమేరా ఫోకస్ చేశాను; ప్రకృతి పరిణామాన్ని ప్రయత్నపూర్వకంగా త్వరితం చెయ్యవచ్చునన్న సంగతి ఆ చెట్టుతోనే నిరూపించారాయన.

“ఒక్క పదహారేళ్ళలోనే ఈ ఆక్రోటు చెట్టు, సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంది. దోహదం జరక్కుండా, ప్రకృతిసహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే, అంతకు రెట్టింపు కాలం పట్టేది.

బర్బాంక్‌గారి చిన్న పెంపుడు కూతురు, తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకి వచ్చింది.