పుట:Oka-Yogi-Atmakatha.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా అమెరికా ప్రయాణం

615

ఉన్నారు. ఆ ఉపన్యాసమే, ఆ తరవాత అమెరికాలో నేను వివిధ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానాలు సంపాయించి పెట్టింది.

ఆ తరవాత, నేను మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. జాగ్రత్తగా వాకబుచేసిన మీదట, ప్రయాణికులు కొందరు చెప్పిన దేమిటంటే: “సంచలనం కలిగించే విధంగా, శుద్ధమైన ఇంగ్లీషులో మీరు ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు.” ఈ సంతోషకరమైన వార్త విని, దేశ కాలావరోధాలన్నిటినీ సున్న చేస్తూ గురుదేవులు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్న సంగతి మళ్ళీ కొత్తగా గ్రహిస్తూ, సరిగ్గా సమయానికి నాకు అందిచ్చిన సహాయానికి ఆయనకు సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.

తక్కిన నా సముద్ర ప్రయాణంలో అప్పుడప్పుడు, బోస్టన్ మహాసభలో ఎదురుకాబోయే ఇంగ్లీషు ఉపన్యాసమనే కఠిన పరీక్షగురించి భయాందోళనలు అనుభవించాను.

“ప్రభూ, నువ్వే నాకు ఏకైక స్ఫూర్తివి అయేలా అనుగ్రహించు,” అని గాఢంగా ప్రార్థించాను.

మా ఓడ, ‘ది సిటీ ఆఫ్ స్పోర్ట్’ సెప్టెంబరు చివరిలో, బోస్టన్ సమీపంలో రేవుకు చేరుకుంది. 1920 అక్టోబరు 6న, అమెరికాలో నా మొట్టమొదటి ప్రసంగంగా, మహాసభలో ప్రసంగించాను. శ్రోతల కది బాగానే నచ్చింది. ‘అమ్మయ్య!’ అని ఒక నిట్టూర్పు విడిచాను. ఉదార హృదయులైన, అమెరికన్ యూనిటేరియన్ కాంగ్రెస్ కార్యదర్శి, మహాసభ కార్యకలాపాల గురించి ప్రచురించిన సమీక్ష[1]లో, కింది విధంగా వ్యాఖ్య రాశాడు.


  1. న్యూ పిల్గ్రిమేజెస్ ఆఫ్ ది స్పిరిట్ (బోస్టన్ : బీకన్ ప్రెస్, 1921)