పుట:Oka-Yogi-Atmakatha.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా అమెరికా ప్రయాణం

611

క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.”

ఆ మహాగురువులు, మహత్తర శక్తియుక్తమైన ఒక్క చూపుతో నాలో విద్యుత్తు పుట్టించి, విశ్వచైతన్యానుభవం ప్రసాదించారు.

“దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా,
 యది భాఃసదృశీ సా స్యాద్ భాస స్తస్య మహాత్మనః."[1]
 
 (ఆకాశంలో ఒకేసారి వెయ్యిమంది సూర్యులు ఉదయించి
 నప్పటికీ కూడా, వారినుంచి వెలువడే కాంతి, మహాత్ముడి
 దివ్యప్రకాశానికి సాటి రాదు).

కాస్సేపట్లోనే బాబాజీ, గుమ్మందగ్గరికి వెళ్ళబోతూ, “నా వెంట రావడానికి పూనుకోకు. నువ్వలా రాలేవు,” అన్నారు.

“బాబాజీ, వెళ్ళిపోకండి; దయ ఉంచి వెళ్ళిపోకండి,” అంటూ మళ్ళీమళ్ళీ ప్రాధేయపడ్డాను. “నన్ను మీతో తీసుకుపొండి!”

“ఇప్పుడు కాదు. మరోమాటు,” అన్నారాయన.

ఉద్రేకం పట్టలేక, ఆయన హెచ్చరికను లెక్కచెయ్యలేదు నేను. ఆయన వెంట పడి పోవడానికి ప్రయత్నం చెయ్యబోతే, నా పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్న సంగతి తెలిసింది. గుమ్మంలోంచి ఆప్యాయంగా నావేపు ఒక చూపు విసిరారు బాబాజీ. ఆశీస్సూచకంగా ఆయన

  1. భగవద్గీత 11 : 12