పుట:Oka-Yogi-Atmakatha.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా అమెరికా ప్రయాణం

609

“ఈశ్వరుడు మళ్ళీ మరొక్కసారి మనని తప్పకుండా కలుపుతాడు,” అంటూ సమాధాన మివ్వడానికి, అంతర్‌జ్ఞానానుభూతివల్ల కలిగిన దృఢవిశ్వాసం ఒకటి ప్రేరణ ఇచ్చింది.

అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోడానికి, గురుదేవుల్నీ నా స్వదేశాన్నీ విడిచి వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా, నాకు కొద్దిగా భయం పుట్టింది. “భౌతికవాది పాశ్చాత్య ప్రపంచం” గురించి నేను చాలా కథలు విన్నాను; సాధుసత్పురుషుల తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీత మవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైన దీ ప్రపంచం.

“తామే అధికులమని అహంకరించే పాశ్చాత్యుల ప్రవర్తనను ఎదుర్కోవాలంటే, ప్రాచ్యదేశంనుంచి వచ్చిన గురువు, హిమాలయాల వల్ల కలిగే చలిబాధలకు తట్టుకోడానికి అవసరమైనదానికన్న ఎక్కువ దృఢంగా ఉండాలి!” అనుకున్నాను.

ఒకనాడు వేకువవేళ ప్రార్థన చెయ్యడం ప్రారంభించాను; ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోయినా సరే, దేవుడి మాట వినేదాకా ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నాను. ఆయన ఆశీస్సులూ, ఆధునిక ఉపయోగితావాదపు పొగమంచులో నేను దారి తప్పిపోనన్న హామీ, కావాలని కోరుకున్నాను. అమెరికా వెళ్ళడానికే నా మనస్సు మొగ్గి ఉంది, కాని అంతకన్న గట్టిగా, దైవానుమతితో చల్లని పలకరింపు ఒకటి వినాలని తీర్మానించుకుంది.

వెక్కివెక్కి వచ్చే ఏడుపు ఆపుకోడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. జవాబేమీ రాలేదు. మధ్యాహ్నానికి నా ప్రార్థన పరాకాష్టకు వచ్చింది; వేదనాభారంతో నా తల తిరిగిపోతోంది. మరొక్కసారి ఏడిచానంటే, నా మనోవేదన మరింత గాఢమయి నా తల పగిలిపోతుందేమో ననిపించింది.