పుట:Oka-Yogi-Atmakatha.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

608

ఒక యోగి ఆత్మకథ

“ఎలా వెళ్ళగలవు?” అని కఠినంగా అడిగారు. “నీ ఖర్చు ఎవరు భరిస్తారు?” నా చదువుకూ నా యావజ్జీవితానికి అయిన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడంవల్ల, ఆయన ప్రశ్న నా ప్రయత్నాన్ని ఠపీమని నిలిపేస్తుందని గట్టిగా ఆశించారాయన.

“ఈశ్వరుడు తప్పకుండా నా ఖర్చులకు డబ్బు సమకూరుస్తారు.” నేను ఈ జవాబు ఇస్తున్నప్పుడు, ఇలాంటి జవాబే చాలాకాలం కిందట ఆగ్రాలో అనంతన్నయ్యకి ఇచ్చానని తలుచుకున్నాను. ఆట్టే అపోహ కలిగించకుండా, ఆ తరవాత అన్నాను, “నాన్నగారూ, నాకు సహాయం చెయ్యమని బహుశా దేవుడే మీ మనస్సుకు తోపించవచ్చు.”

“ఊఁహుఁ, ఎన్నటికీ అలా జరగదు!” అంటూ జాలిగా చూశారు నావేపు.

అందువల్ల, ఆ మర్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తానికి రాసిన చెక్కు ఒకటి నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

“నేను నీకీ డబ్బు ఇస్తున్నది, తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు; లాహిరీ మహాశయులకు విశ్వాసపాత్రుడైన శిష్యుడిగా మాత్రమే. ఇక ఆ పడమటి దేశానికి వెళ్ళు; జాతిమతభేదం లేని క్రియాయోగ బోధలు వ్యాప్తిచెయ్యి.”

నాన్నగారు నిస్స్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికల్ని పక్కకి పెట్టగలిగినందుకు నా హృదయం గాఢంగా చలించింది. నన్ను విదేశయాత్రకు పురిగొల్పినది సాధారణమైన కోరిక ఏమీ కాదని అంతకు ముందు రాత్రి ఆయనకు సరయిన అనుభూతి కలిగింది.

“బహుశా మళ్ళీ మనం ఈ జన్మలో కలుసుకోమేమో.” అప్పటికే అరవై ఏడేళ్ళ వయస్సులో ఉన్న నాన్న గారు విచారంగా అన్నారు.