పుట:Oka-Yogi-Atmakatha.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

595

శరీరాన్ని త్వరలో విడిచి వెళ్ళిపోవలసి వస్తుందని తెలుసుకున్నారనీ నేను గ్రహించాను. గురుదేవులు తక్షణమే తమను తాము అదుపులో పెట్టుకుని, భౌతిక ప్రపంచంతో తమకు ముడిపడి ఉన్న చిట్టచివరి దారాన్ని తెంపుకొని చిరంతన పరమాత్మ తత్త్వంలోకి పలాయనం చేశారని ఆయన భీకర మౌనం నిరూపించింది. బాబాజీ సందేశం, ‘నేను నీతో ఎప్పుడూ ఉంటాను’ అని చెప్పడానికి ఆయన అనుసరించిన పద్ధతి.

“బాబాజీ, లాహిరీ మహాశయులూ సర్వజ్ఞులయినప్పటికీ నా ద్వారాకాని మరో మధ్యవర్తి ద్వారాకాని ఒకరికొకరు వర్తమానాలు పంపుకోవలసిన అవసరం లేనప్పటికీ ఆ మహానుభావులు, మానవ నాటకంలో ఒక పాత్ర నిర్వహించడానికి తరచుగా ఇతరులను అనుగ్రహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తమ భావిదర్శనాల్ని మామూలు పద్ధతిలో వార్తావహుల ద్వారా తెలియజేస్తూ ఉంటారు; ఎందుకంటే, తమ మాటలు చివరికి నెరవేరిన తరవాత, ఉత్తరోత్తరా ఈ కథ వినే జనబాహుళ్యంలో ఇతోధిక మైన దైవభక్తి కలిగించడానికి.”

“త్వరలోనే నేను కాశీ నుంచి వచ్చేసి శ్రీరాంపూర్‌లో, బాబాజీ కోరిన పవిత్ర గ్రంథ రచనాకార్యక్రమానికి పూనుకొన్నాను,” అంటూ ఇంకా చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “నేను ఇలా పనికి పూనుకొన్నానో లేదో, ఆ అమర గురుదేవులకు అంకితంగా ఒక శ్లోకం రాయాలన్న ఉత్ప్రేరణ నాలో కలిగింది. అంతకు ముందెన్నడూ నేను సంస్కృత కవిత్వ రచనకు పూనుకోకపోయినప్పటికీ, మధురమైన పద్యపాదాలు అనాయాసంగా నా కలంలోంచి ప్రవహించసాగాయి.”

“ప్రశాంత నిశీధ సమయంలో నేను, బైబిలునూ సనాతనధర్మ[1]

  1. అంటే, “శాశ్వతమైన మతం” అని అర్థం; వేదబోధల సమస్తానికి పెట్టిన పేరు ఇది. ఈ ‘సనాతన ధర్మం’. గ్రీకుల కాలంనుంచి ‘హిందూమతం’గా పేరు పొందింది. సింధునదీ తీరాల్లో నివసించే ప్రజలకు గ్రీకులు, హిందువులు (Indoos, or Hindus) అని పేరు పెట్టారు.