పుట:Oka-Yogi-Atmakatha.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

593

ఇదంతా ఎవరి పని? ఈ పనులన్నీ చేసేవాడు ఎవరు? ఈశ్వరుడు నా చేత ఏది చెప్పిస్తే అది సత్యమై తీరక తప్పదు.’ ”

“ఆ సాధువు ఆశీస్సులవల్ల నేను ఆ శక్తి పొందినట్లు భావించి, ఆ పుస్తకం రాయడానికి ఒప్పుకున్నాను. నేను సెలవు తీసుకోవలసిన సమయం వచ్చిందని అనిపించి, మనస్సు ఒప్పకపోయినా, నా పత్రాసనం మీంచి లేచాను.”

“ ‘నీకు లాహిరీ తెలుసా?’ అని అడిగారు, మహాగురువులు. ‘అతను మహాత్ముడు కదూ? మనం కలుసుకున్న సంగతి అతనికి చెప్పు.’ ఆ తరవాత లాహిరీ మహాశయులకు అందించవలసిన వర్తమానం నాకు చెప్పారు.

“వీడుకోలుగా, నేను సవినయంగా వంగి నమస్కారం చేసిన తరవాత ఆ సాధువు, ప్రసన్నంగా చిరునవ్వు నవ్వారు. ‘ నీ పుస్తకం పూర్తి అయిన తరవాత నిన్నోసారి చూడ్డానికి వస్తాను,’ అని మాట ఇచ్చారు. ప్రస్తుతానికి సెలవు.”

“ఆ మర్నాడు నేను కాశీ వెళ్ళడానికి రైలు ఎక్కాను. మా గురుదేవుల నివాసానికి చేరి, కుంభమేళాలో కనిపించిన అద్భుతయోగి కథ అంతా ఏకరువు పెట్టాను.”

“ ‘అయ్యో, ఆయన్ని గుర్తు పట్టలేదా నువ్వు?’ లాహిరీ మహాశయుల కళ్ళు నవ్వుతో నాట్యమాడుతున్నాయి. ‘నువ్వు గుర్తుపట్టలేక పోయావని తెలుస్తోంది; అందుకాయన అడ్డుపెట్టారు నిన్ను. ఆయన అసదృశులయిన నా గురుదేవులు; దైవస్వరూపులైన బాబాజీ!’

“ ‘బాబాజీ!’ అంటూ మారుపలికాను, ఆశ్చర్యచకితుణ్ణి అయి, ‘యోగీశ్వరులు బాబాజీ!, దృశ్యాదృశ్య రక్షకులు బాబాజీ! అయ్యో