పుట:Oka-Yogi-Atmakatha.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

591

విజయాల్లో ఉన్నతులే అయినప్పటికీ, చాలామంది పాశ్చాత్యులు, కఠోరమైన భౌతికవాదానికి కట్టుబడిపోయినవాళ్ళు. విజ్ఞానశాస్త్రంలోనూ తత్త్వశాస్త్రంలోనూ ప్రసిద్ధులైన ఇతరులు, మతంలో ఉన్న సారభూతమైన ఏకత్వాన్ని గుర్తించరు. వాళ్ళ ధర్మాలు, దాటశక్యంకాని అవరోధాలై, వాళ్ళని శాశ్వతంగా మననుంచి వేరు చేస్తున్నాయి.’ ”

“ ‘పాశ్చాత్య ప్రపంచంగురించి, ప్రాచ్య ప్రపంచంగురించి కూడా నీకు ఆసక్తి ఉండడం చూస్తున్నాను.’ బాబాజీ ముఖం, ఆమోదంతో వెలుగొందింది. ‘నీ హృదయవేదన నాకు తెలుసు; విశాలమైన నీ గుండెలో మానవులందరికీ చోటు ఉంది. అందుకే నిన్నిక్కడికి పిలిపించాను.’ ”

“ ‘తూర్పు పడమర దేశాలు, కార్యకలాపాల్నీ ఆధ్యాత్మికతనూ మేళవించిన చక్కని మధ్యేమార్గాన్ని ఏర్పరచుకోవాలి,’ అంటూ ఇంకా చెప్పారు బాబాజీ. ‘భౌతిక అభివృద్ధి విషయంలో పడమటి దేశాలనుంచి భారతదేశం నేర్చుకోవలసింది చాలా ఉంది, దానికి బదులుగా, పడమటి దేశాలు తమ మతవిశ్వాసాలకు యోగశాస్త్రీయమైన గట్టి పునాదులు ఏర్పరచుకోడానికి తోడ్పడే విశ్వజనీన పద్ధతుల్ని భారతదేశం నేర్పగలదు.’ ”

“ ‘స్వామీజీ, ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల మధ్య ముందుముందు జరగబోయే, సామరస్య పూర్వకమైన వినిమయంలో మీరు నిర్వహించ వలసిన పాత్ర ఒకటి ఉంది. మరి కొన్నేళ్ళకి, నేను మీ దగ్గరికి ఒక శిష్యుణ్ణి పంపుతాను; పాశ్చాత్య ప్రపంచంలో యోగవిద్యా వ్యాపనానికి మీరతన్ని తర్ఫీదు చెయ్యగలరు. ఆధ్యాత్మికంగా అన్వేషణ సాగిస్తున్న, అక్కడి అనేక ఆత్మల స్పందనలు వరదలా నా దగ్గరికి వస్తూంటాయి. అమెరికాలోనూ యూరప్‌లోనూ, జాగృతి పొందడానికి ఎదురుచూస్తున్న భవిష్యత్ సాధువుల్ని నేను చూస్తూ ఉన్నాను.’ ”