పుట:Oka-Yogi-Atmakatha.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

590

ఒక యోగి ఆత్మకథ

భక్తుల్లో మునిగిపోకుండా, తమ సమక్షంలో పూర్తిగా సహజంగా ఉండాలని మహాగురువులు ఆశించారని స్పష్టమవుతోంది.”

“ ‘కుంభమేళా గురించి ఏ మనుకుంటున్నావు?’ ”

“ ‘స్వామీ, నాకు చాలా నిరాశ కలిగిందండి,’ అని చెప్పి, చటుక్కున ఇంకా ఇలా అన్నాను, ‘మిమ్మల్ని కలుసుకునేటంత వరకు, ఏమిటో కాని, సాధువులకీ ఈ సంక్షోభానికి పొత్తు కుదిరినట్టు కనిపించడం లేదండి.’ ”

“ ‘బాబూ,’ అంటూ ప్రారంభించారు ఆ మహాగురువులు - ఆయన వయస్సుకు నేను దాదాపు రెట్టింపు వయస్సులో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ. చాలామందిలో ఉండే తప్పులవల్ల, మొత్తం అందరినీ గురించి మంచిచెడ్డలు నిర్ణయించకు. భూమి మీద ప్రతిదీ, ఇసకా పంచదారా కలిసిపోయినట్టుగా, మిశ్రమై ఉన్నదే. పంచదార మాత్రమే తీసుకుని ఇసకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. చాలామంది సాధువులు ఇక్కడ మాయలో సంచరిస్తున్నప్పటికీ, దైవ సాక్షాత్కారానుభూతి గల కొద్దిమందివల్ల ఈ మేళా పునీతమయింది.’ ”

“ఈ మహాగురువులతో నాకు సమాగమం జరిగినందువల్ల నేను త్వరగానే ఆయన అభిప్రాయంతో ఏకీభవించాను.”

“ ‘అయ్యా, దూరాన ఉన్న యూరప్‌లోనూ అమెరికాలోనూ నివసిస్తూ, వివిధ మతధర్మాల్ని బోధిస్తూ, ఇప్పటి మేళా లాంటివాటి నిజమైన విలువలు ఎరక్క, ఇక్కడ కూడిన చాలామంది కంటె తెలివిలో చాలా గొప్పవాళ్ళయిన ప్రముఖ పాశ్చాత్య విజ్ఞానశాస్త్రవేత్తల్ని గురించి నేను ఇంతవరకు ఆలోచిస్తూ ఉన్నానండి. భారతదేశపు సద్గురువులతో సమావేశాలవల్ల ఎక్కువగా లాభం పొందగలవాళ్ళు వీళ్ళు. కాని భౌతిక