పుట:Oka-Yogi-Atmakatha.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు శరీరాలున్న సాధువు

41

ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. “మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు! ఈ స్వామి ఒట్టి మామూలు మనిషే అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది.” మే మిద్దరం కలిసి ఆ స్వాములవారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్లకింద ఉన్న పావుకోళ్ళ వేపు చూపించారు కేదార్‌నాథ్‌బాబు.

“ఇవిగో, స్నానాల రేవులో ఈ పాంకోళ్ళే వేసుకున్నారీయన,” అంటూ గుసగుసలాడారు. “ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగోస్త్రం కట్టుకుని ఉన్నారు.”

వచ్చినాయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా, స్వాములవారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు.

“ఇదంతా చూసి ఆశ్చర్యపోతా వెందుకు? ఈ దృగ్విషయిక ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే, దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్ళతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళు, సంకల్ప మాత్రం చేత, స్థూల పదార్థంవల్ల కలిగే ప్రతీ అవరోధాన్ని అధిగమించ గలరు.”

ఈ స్వాములవారు తమకు గల దూరదర్శన, దూరశ్రవణ[1] శక్తుల్ని

  1. మనస్తత్వశాస్త్రం ద్వారా యోగులు వెల్లడించిన శాస్త్రనియమాల చెల్లుబడిని గురించి భౌతికశాస్త్రం, దాని పద్ధతిలో అది రూఢి చేస్తోంది. ఉదాహరణకు, మానవుడికి దూరదర్శన శక్తులున్నాయన్న సంగతి, 1934 నవంబరు 26 తేదీన రాయల్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్ అనే విశ్వవిద్యాలయంలో నిరూపించడం జరిగింది. డా|| గిసేవ్ కాలిగారిస్ అనే స్నాయనిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త (న్యూరో సైకాలజీ ప్రొఫెసరు) ఒక వ్యక్తి శరీరంలో నిశ్చితమైన కొన్ని భాగాలు చేత్తో ఒత్తాడు. అప్పుడా వ్యక్తి, గోడకు అవతల ఉన్న వ్యక్తుల్నీ, వస్తువుల్నీ సూక్ష్మమైన వివరాలతో సహా వర్ణించి చెప్పాడు. చర్మం మీద నిశ్చతమైన కొన్ని చోట్ల సంచలనం కలిగిస్తే, ఆ వ్యక్తికి అతీంద్రియానుభూతులు కలుగుతాయనీ, మరో విధంగా చూడలేని వస్తువుల్ని చూడగలుగుతాడనీ డా: కాలిగారిస్, అక్కడి ప్రొఫెసర్లకు చెప్పాడు. ఆ వ్యక్తి, గోడవతల ఉన్న వస్తువుల్ని చూసేటట్టు చెయ్యడానికి ప్రొ॥ కాలిగారిస్, అతని రొమ్ముకు కుడివేపు ఒకచోట పదిహేను నిమిషాల పాటు చేత్తో ఒత్తాడు. శరీరంలో కొన్ని నిశ్చిత స్థానాల్ని సంచలింపజేసినప్పుడు మనుషులు, కొన్ని వస్తువుల్ని, అంతకు పూర్వం తాము చూసినా చూడకపోయినా, ఎంత దూరమైనవాటి నయినా చూడగలుగుతారని డా|| కాలిగారిస్ అన్నాడు."