పుట:Oka-Yogi-Atmakatha.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

576

ఒక యోగి ఆత్మకథ

“గురుదేవా, నేను రెండో దీక్షకు నిశ్చయంగా సిద్ధంగా ఉన్నాను.”

సరిగా ఇదే సమయంలో తలుపు తెరుచుకుంది; వినయ సంపన్నుడైన బృందా భగత్ అనే శిష్యుడు లోపల అడుగుపెట్టాడు. అతను కాశీలో ఒక పోస్ట్‌మాన్.

“బృందా, ఇలా నా పక్కన కూర్చో.” మహాగురువులు అతనికేసి ఆప్యాయంగా చిరునవ్వు చిందిస్తూ చూశారు. “ఒక్కమాట చెప్పు; క్రియాయోగంలో రెండో ప్రక్రియకు సిద్ధంగా ఉన్నావా?”

ఆ పోస్ట్‌మాన్, గురుదేవులను వేడుకుంటున్నట్టుగా చేతులు జోడించాడు. “గురుదేవా, ఇంకే ఉపదేశాలూ నాకు వద్దండి! ఇంతకన్న పై ఉపదేశాల్ని ఎలా ఒంటబట్టించుకోగలను? ఈ రోజు, మీ దీవెనలు కోరడం కోసం వచ్చాను; ఏమంటే, మొదటి క్రియే నన్ను దైవపర మయిన మత్తుతో నింపేసి నేను ఉత్తరాలు బట్వాడా చెయ్యలేకుండా చేసిందండి!” అన్నాడు భయంగా.

“అప్పుడే బృంద, ఆత్మసాగరంలో ఈతలాడుతున్నాడు.” లాహిరీ మహాశయులన్న ఈ మాటలకు, ఆ రెండో శిష్యుడు తల వంచుకున్నాడు.

“గురుదేవా, పనిచెయ్యడం చేతకాక పనిముట్లకు వంకలుపెట్టే నాసిరకం పనివాణ్ణి నేను.” అన్నాడతను.

వినయశీలుడైన ఆ పోస్ట్‌మాన్, చదువుకున్నవాడు కాడు; కాని తరవాత అతను క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంతవరకు అభివృద్ధిచేసుకున్నాడంటే ధర్మశాస్త్ర విషయాలకు సంబంధించిన సమస్యలకు అతను చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు పండితులు కూడా వస్తూ ఉండేవారు. పాపమూ పాండిత్యమూ రెండూ ఎరగని బృందాభగత్, పండిత లోకంలో ప్రసిద్ధి పొందాడు.