పుట:Oka-Yogi-Atmakatha.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

ఒక యోగి ఆత్మకథ

“నా కిప్పుడు వేరే పని ఉంది. అప్పుడాయన చూసిన చూపులోని మర్మం నా కర్థం కాలేదు. ‘మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతి బాబుగా రబ్బాయీ నేనూ అక్కడ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం.’

“ ‘అలా కాదు,’ అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమై పోయారు. నేను వీలయినంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను.”

ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయింది. ఈ స్వామీజీ, మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగాను.

“కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం. కాని ఈమధ్య కలవ లేదు. మళ్ళీ ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను.”

“నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను! నాకుగాని మతిపోతోందా? మీకు ఆయన కలలో కనిపించారా లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి, ఆయన చెయ్యి ముట్టుకుని, ఆయన అడుగుల చప్పుడు విన్నారా?”

“నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు!” కోపంతో ఆయన ముఖం జేవురించింది. “నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగానని అర్థమవడం లేదూ?”

“అదేమిటి? ఆయన- ఆ ప్రణవానంద స్వామిగారు సుమారు ఒక గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటినుంచి నా కళ్ళముందు నుంచి కదలలేదు!” అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకీ నాకూ జరిగిన సంభాషణ కూడా చెప్పాను.