పుట:Oka-Yogi-Atmakatha.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

573

ఆ తరవాత తమతమ పరిసరాలకూ పెంపకానికీ తగినట్టుగా తమ జీవితాల్ని అభివ్యక్తం చేసుకొనే స్వేచ్ఛ తమ శిష్యులకు ఇస్తూండేవారు.

“ముస్లిం, రోజుకు ఐదుసార్లు నమాజ్[1] చెయ్యాలి,” అని చెప్పేవారు గురుదేవులు. “హిందువు, రోజుకు అనేకమాట్లు ధ్యానంలో కూర్చోవాలి. క్రైస్తవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబిలు చదువుతూ రోజూ అనేక మాట్లు మోకాళ్ళ మీద వంగాలి.”

ఈ గురువర్యులు సునిశితమైన వివేచనతో, తమ శిష్యుల్ని, వారి వారి సహజ ప్రవృత్తుల్ని బట్టి, భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గాల్లో నడిపించేవారు. సాంప్రదాయికమైన సన్యాసమార్గంలో ప్రవేశించదలిచిన భక్తులకు అనుమతి ఇవ్వడంలో ఈ గురువర్యులు చాలా నిదానం చూపేవారు. సన్యాసాశ్రమ విధుల్నిగురించి మొదటే బాగా ఆలోచించుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు.

పవిత్ర గ్రంథాలగురించి సిద్ధాంత చర్చ మానమని ఆ మహాగురువులు శిష్యులకు చెబుతూండేవారు. “సనాతన దివ్యదర్శనాల్ని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకుండా, వాటిని సిద్ధింపజేసుకోడంలో నిమగ్నుడయేవాడే జ్ఞాని,” అన్నారాయన. “ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి.[2] లాభంలేని, మతసంబంధమైన ఊహలకు బదులు, వాస్తవమైన దైవసంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి. మీ మనస్సుల్లోంచి, దైవశాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్తకుప్ప తొలగించెయ్యండి; అపరోక్ష జ్ఞానమనే స్వచ్ఛమైన, ఉపశమనకారకమయిన జలాల్ని లోపలికి పారనివ్వండి. చురుకైన ఆంతరిక, మార్గదర్శిత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి; జీవితంలో ప్రతి సందిగ్ధస్థితికి దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది. తనకి తాను చిక్కులు తెచ్చి పెట్టుకోడంలో మనిషి

  1. ముస్లిముల ముఖ్య సాధన
  2. “సత్యాన్ని ధ్యానంలో అన్వేషించు; బూజుపట్టిన పుస్తకాల్లో కాదు, చంద్రుణ్ణి చూడాలంటే ఆకాశంలోకి చూడు, నీటి మడుగులో కాదు.” – పారశీక సామెత.