పుట:Oka-Yogi-Atmakatha.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

570

ఒక యోగి ఆత్మకథ

తెలుసు. అయినా మీరు, సంకల్పమాత్రంచేత దేశకాలాల్ని బహిష్కరించగల రన్నదే నమ్మలేకుండా ఉన్నాను.”

చివరికి, అనుకున్న ఉత్తరం వచ్చింది. అందులో, తమ భార్య కోలుకోడాన్ని గురించిన శుభవార్త ఉండడమే కాదు, కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చూమచ్చూ ఆలాగే ఉన్నాయి.

కొన్ని నెలల తరవాత, ఆయన భార్య భారతదేశానికి వచ్చింది. లాహిరీ మహాశయుల్ని కలుసుకుని పూజ్య భావంతో ఆయన్ని తదేకంగా చూసింది.

“కొన్ని నెల్లకిందట నేను, లండన్‌లో నా రోగశయ్య పక్కన చూసింది, దివ్యకాంతితో పరివేష్టితమైన ఉన్న మీ రూపాన్నే. తక్షణమే నాకు జబ్బు పూర్తిగా నయమయింది! తరవాత కొద్ది కాలానికే, ఇండియాకు దీర్ఘమైన సముద్ర ప్రయాణం చెయ్యగలిగాను,” అంది ఆమె.

ఆ మహాగురువులు, రోజు రోజుకూ ఒకరిద్దరికి క్రియాయోగ దీక్ష ఇస్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మిక విధులకూ ఉద్యోగ, కుటుంబ సంబంధమైన బాధ్యతలకూ తోడుగా ఈ మహాగురువులు, విద్యావిషయంలో ఉత్సాహభరితమైన ఆసక్తి కనబరిచారు. అనేక అధ్యయన బృందాలు ఏర్పరిచారు; కాశీలో బెంగాలీ టోలా బస్తీలో ఉన్న పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధిచెయ్యడానికి క్రియాశీలకమైన కృషి చేశారు. వారం వారం జరిగే సమావేశాల్లో ఈ గురుదేవులు, అనేకమంది జిజ్ఞాసువులైన సత్యాన్వేషకుల కోసం, పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు; ఈ సమావేశాలకు “గీతా అసెంబ్లీ” అని పేరు వచ్చింది.

బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా, లాహిరీ మహాశయులు