పుట:Oka-Yogi-Atmakatha.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు శరీరాలున్న సాధువు

39

ఇక నేను, మంచీ మర్యాదా చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా, చామన చాయగా, మధ్య తరహా ఎత్తు ఉన్న ఒకాయన్ని కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు.

"కేదార్‌నాథ్ బాబుగారు మీరేనా?” నా గొంతులో ఉద్రేకం నిండింది.

“ఔను. నువ్వు భగవతి బాబుగారి కొడుకువి కదూ- నన్ను కలుసుకోడానికి ఇక్కడ కాచుకొని ఉన్నావు కదూ?” స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన.

“ఏమండీ, మీ రిక్కడికి రావడం ఎలా జరిగింది?” చెప్ప శక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయి నట్టయింది; విస్మయం కలిగింది.

“ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు ఒక గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామిగారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నే నక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు.”

“భగవతి బాబుగారబ్బాయి మీ కోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు. మీరు నాతో వస్తారా?” అన్నారు. నేను సంతోషంగా సరే నన్నాను. మే మిద్దరం చెయ్యీ చెయ్యీ పట్టుకుని వస్తూ ఉండగా, పావు కోళ్ళతో నడుస్తున్న ఆ స్వామివారు, ఈ గట్టి బూట్లతో నడిచే నా కన్న చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కరిగించింది.

“మా ఇల్లు చేరుకోడానికి మీకు ఎంతసేపు పడుతుంది?” అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను, ప్రణవానందులు.

“సుమారు అరగంట.”