పుట:Oka-Yogi-Atmakatha.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

563

ఆనందంతో ఆయన ముఖబింబమే మారిపోయింది. ‘చిన్న పిల్లవాడు నీటి బుడగలతో ఆడుకున్నట్టే పరమ గురుదేవులు దేశకాలాలతో ఆట ఆడుకున్నారు. స్వర్గ, భూలోకాల కీలకాలు చేతనున్న వ్యక్తిని చూశాను.’

“త్వరలోనే దానాపూర్ తిరిగి వచ్చాను. ఆత్మతత్త్వంలో దృఢంగా నిలదొక్కుకుని ఉండి గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలూ, ఉద్యోగ బాధ్యతలూ మళ్ళీ చేబట్టాను,” అంటూ ముగించారు లాహిరీ మహాశయులు.

బాబాజీతో జరిగిన మరో సమాగమానికి సంబంధించిన కథ కూడా లాహిరీ మహాశయులు, స్వామి కేవలానందగారికీ శ్రీయుక్తేశ్వర్‌గారికీ చెప్పారు. ఆ సందర్భం, “నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను,” అన్న వాగ్దానాన్ని పరమగురుదేవులు నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటి.

“అలహాబాదులో కుంభమేలా జరుగుతున్న సన్నివేశమది,” అని చెప్పారు. లాహిరీ మహాశయులు తమ శిష్యులకు. “ఆఫీసు పనులనుంచి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఈ పవిత్ర ఉత్సవానికి హాజరవడం కోసం దూరదూర ప్రదేశాలనుంచి వచ్చిన సన్యాసి, సాధుజనాల గుంపుల మధ్య తిరుగుతూ, ఒంటికి బూడిద పూసుకుని చేత్తో భిక్షాపాత్ర పట్టుకుని ఉన్న ఒక తపస్విముందు ఒక్క క్షణం ఆగాను. ఈ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన నా మనస్సులో పుట్టింది; బాహ్యవైరాగ్య చిహ్నాలు ధరించాడే కాని, దానికి సరిపడే అంతరంగం లేనివాడనిపించింది.