పుట:Oka-Yogi-Atmakatha.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

ఒక యోగి ఆత్మకథ

చుట్టూ ఆవరించింది. మొట్టమొదట, ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి; తరవాత మందగించాయి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్న గారి స్నేహితుణ్ణి కలుసుకోడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నా కక్కడ ముళ్ళమీద కూర్చున్నట్టు ఉంది. ఇంక ఏం తోచక, రవ్వంత విసుగుదలతో, మే మిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో, చుట్టూ కలయజూశాను. ఆయన కూర్చున్న బల్లకింద పావుకోళ్ళు నా కంటపడ్డాయి.

“చిన్నబాబూ![1] గాభరాపడకు. నువ్వు చూడదలిచినాయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు.” ఆ యోగి నా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు - ఆ సమయంలో అది, ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు.

మళ్ళీ ఆయన, అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. ముప్ఫయి నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచీ తెలిపేసరికి స్వామివారు లేచారు.

“కేదార్‌నాథ్ బాబుగారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను,” అన్నారాయన. ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో, నమ్మజాలనంత ఆశ్చర్యం పెల్లుబికింది; నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి; “కబురు చెప్పడానికి ఎవరినీ పంపించకుండానే, నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాములవారు నాతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదే!”

  1. కొందరు భారతీయ సాధువులు నన్ను ‘చోటా మహాశయా’ అని పిలిచేవారు. దానికి “చిన్నబాబు” అని అర్థం.