పుట:Oka-Yogi-Atmakatha.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

549

చాడు. దాన్ని త్వరితం చేశాడు; పరమాణుశక్తి ఆ తరవాత పదార్థమూ పుట్టాయి. భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘనగోళాకృతిగా రూపొందించాడు. దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి, తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూ భావం, స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది.

“ ‘కలగనేవాడి అవచేతనాపరమయిన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలుకువలో ఆ సంయోజక ఆలోచన ఉపసంహారమైనప్పుడు, ఆ స్వప్నమూ, దాని మూలకాలు కూడా లయమయిపోతాయి. మనిషి, కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు; మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతను, దేవుడి మౌలికాదర్శాన్ని అనుసరిస్తాడు. అదే విధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు, బ్రహ్మాండ స్వప్నరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు.

“ ‘సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ, మూలకణువుల్ని, సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణమాత్రంలో నెలకొలిపిన ఈ బంగారు భవనం, ఈ భూమి ఎంత వాస్తవమయినదో అంత వాస్తవమయినది. బాబాజీ ఈ సుందర సౌధాన్ని తమ మనస్సులోంచి సృష్టించారు? దాని పరమాణువుల్ని తమ సంకల్పశక్తిచేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టూ, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నట్టుగానే.’ ”