పుట:Oka-Yogi-Atmakatha.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

544

ఒక యోగి ఆత్మకథ

“ ‘నా తంతి పనిచేసినట్టు తెలుస్తోంది.’ ఆ యోగి చేసిన వ్యాఖ్య నాకు అగమ్యంగా ఉంది; దాని అర్థమేమిటని అడిగాను.”

“ ‘నేను చెప్పింది, నిన్నీ నిర్జన ప్రదేశాలకు రప్పించిన టెలిగ్రాం సంగతి. నీకు రాణీఖేత్‌కు బదిలీ కావాలని నీ పై ఆఫీసరు మనస్సుకు నిశ్శబ్దంగా సూచించినవాణ్ణి, నేను. ఎవరయినా, మానవ జాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనస్సులూ అతనికి ప్రసారణ కేంద్రాలవుతాయి; వాటి ద్వారా అతడు ఇచ్ఛానుసారంగా పని చేస్తాడు,’ అంటూ ఆయన, ‘లాహిరీ, ఈ గుహ నీకు, తప్పకుండా తెలిసిందానిలాగే కనిపిస్తోంది కదూ?’ అని అడిగారు.

“నేను దిమ్మెరబోయి మౌనం దాల్చి ఉండడంతో, ఆ సాధువు నా దగ్గరికి వచ్చి నా నుదుటిమీద మెల్లగా తట్టారు. ఆయన అయస్కాంత స్పర్శతో నా మెదడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ప్రవాహం ప్రసరించింది; నా గతజన్మ తాలూకు మధురమైన బీజస్మృతుల్ని మేల్కొలిపింది.

“ ‘జ్ఞాపకం వచ్చింది!’ పట్టలేని ఆనందంతో వెక్కివెక్కి ఏడవడం వల్ల నా గొంతు సగం పూడుకుపోయింది. ‘మీరు నా గురుదేవులు బాబాజీ; ఎప్పటికీ నావారే! గతకాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనస్సులో మెదులుతున్నాయి; ఇక్కడ ఈ గుహలోనే గడిపాను, కిందటి జన్మలో చాలా ఏళ్ళు!’ చెప్పనలవి కాని జ్ఞాపకాలు నన్ను ముంచెత్తేస్తూ ఉంటే, కన్నీళ్ళు నింపుతూ గురుదేవుల పాదాలను చుట్టేసుకొన్నాను.

“ ‘నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని ముప్పై ఏళ్ళు పైబడి నీ కోసం కాసుకొని ఉన్నాను.’ బాబాజీ గొంతులో దివ్య ప్రేమ తొణికిస లాడింది. ‘నువ్వు మరణానంతర జీవితపు కల్లోల తరంగాల్లోకి జారి అదృశ్యమయిపోయావు. నీ కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది;