పుట:Oka-Yogi-Atmakatha.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు శరీరాలున్న సాధువు

37

ఆయన తల ఊపారు. “నువ్వు భగవతి బాబుగారి కొడుకువా?” ఆయన మాటలు, నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే, బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఆయనకు అందించాను; కాని అదింక అనవసరమే అనిపించింది.

“కేదార్‌నాథ్ బాబుగారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే, నీ కోసం.” ఈ స్వాములవారు తమ దివ్యదృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు.

“నేను రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను, నీకు తెలుసా! ఒకటి మీ నాన్నగారి సిఫార్సువల్ల వచ్చినది- ఒకప్పుడు నేను ఆయన దగ్గిర రైల్వే ఆఫీసులో పనిచేశాను; రెండోది పరమేశ్వరానుగ్రహంవల్ల వచ్చినది. ఆయన సేవలో, జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తిచేశాను.”

ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. “పరమేశ్వరుడి దగ్గరి నుంచి మీకు వచ్చేది ఎలాటి పెన్షనండీ? ఆయన డబ్బేమయినా మీ ఒళ్ళో పడేస్తాడా?”

ఆయన నవ్వారు. “అంటే, గాఢమైన ప్రశాంతి అన్నమాట- ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బుకోసం ఆశ పడను. నా కున్న కొద్దిపాటి భౌతికావసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షను కున్న ప్రాముఖ్యం నీకు ముందుముందు తెలుస్తుంది.”

మా సంభాషణను చటుక్కుని తుంచేసి, స్వామివారు గంభీరమైన నిశ్చలరూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన