పుట:Oka-Yogi-Atmakatha.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

538

ఒక యోగి ఆత్మకథ

“ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు, ప్రసన్నంగా నావేపు తిరిగారు.”

“ ‘భయపడకు రామగోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయావు,’ అన్నారాయన.”

“బాబాజీ మృదుమధురస్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపమూ లాహిరీ మహాశయుల రూపమూ మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానది వేపు కదిలాయి. ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా, వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతిపలక మళ్ళీ, కిందికి వచ్చి, కంటికి కనిపించని మీట ఏదో నొక్కితే జరిగినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది.

“అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరీ మహాశయుల నివాసానికి దారి తీశాను. వేకువ సంజెలో ఆయనముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు.”

“ ‘చాలా సంతోషం రామగోపాల్,’ అన్నారాయన. ‘బాబాజీనీ మాతాజీనీ దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తంచేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది.’ ”

“నడిరాత్రి వేళ నేను ఇక్కణ్ణించి వెళ్ళినప్పటినించి లాహిరీ మహాశయులు తమ వేదికమీంచి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు.”

“ ‘నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తరవాత ఆయన, అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు.’ అన్నాడొక శిష్యుడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరువేరు చోట్ల, రెండు శరీరాలతోనో అంతకంటే ఎక్కువ శరీరాలతోనో కనిపిస్తూ ఉంటా