పుట:Oka-Yogi-Atmakatha.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ

537

బాబాజీ అని వెంటనే పోల్చుకోగలిగాను. ఆయన లాహిరీ మహాశయుల్లా ఉన్నారు. కానయితే ఇద్దరికీ ఉన్న తేడా అల్లా, బాబాజీ ఆయనకంటె యువకుల్లా కనిపిస్తారు; పొడుగాటి జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.”

“లాహిరీ మహాశయులూ, మాతాజీ, నేనూ మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం. ఆయన దివ్యశరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువూ పరమానందానుభూతితో పరవశమయింది.

“ ‘నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదా మనుకుంటున్నాను,’ అన్నారు బాబాజీ.

“ ‘ప్రియ గురుదేవా, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి?’ ఆ మహితాత్మురాలు ఆయనవైపు ప్రార్థనపూర్వకంగా చూశారు.”

“నా ఆత్మసాగరం మీద నేను, కంటికి కనిపించే అల రూపాన్ని ధరిస్తే నేమి, కనిపించని అల రూపాన్ని ధరిస్తే నేమి? తేడా ఏముంటుంది?”

“వెంటనే మాతాజీ, ‘అమర గురుదేవా, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి,’ అన్నారు ఛలోక్తిగా.

[1]

“ తథాస్తు,’ అన్నారు బాబాజీ, గంభీరంగా. ‘నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను. ఇది భూమిమీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదగా చెప్పించాడు.

  1. ఈ సంఘటన నాకు థేలీజ్ కథను గుర్తుకు తెస్తోంది. ఈ ప్రముఖ గ్రీకు తత్త్వవేత్త, జీవితానికి మరణానికి భేదం లేదని బోధించాడు. “అయితే మరి మీ రెందుకు చనిపోరు?” అని అడిగాడొక విమర్శకుడు., “రెంటికి తేడా లేదు కనకనే,” అని జవాబిచ్చాడట థేలీజ్.