పుట:Oka-Yogi-Atmakatha.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

ఒక యోగి ఆత్మకథ

పోయింది. కాని మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామీ ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు; ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజెయ్యగలవనుకుంటాను. ఆ స్వామీ నేనూ ఒకే గురువుగారి శిష్యులం; ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనంవల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చెయ్యడానికి పనికొస్తుంది.”

“ఇదుగో, ఇకనుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవడాలేవీ కుదరవు-- గుర్తుంచుకో!” అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి.

నా కుండే పన్నెండేళ్ళ వయస్సుకు సహజమైన ఉత్సాహంతో (అయితే, కొత్త దృశ్యాలు కొత్త ముఖాలూ చూడ్డంలో నా కున్న ఆనందాన్ని, కాలం ఎన్నడూ తగ్గించలేదు) బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందుతలుపు తెరిచి ఉంది. రెండో అంతస్తులో ఉన్న పొడుగాటి, విశాలమైన గదిలోకి దారి తీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న, కొంచెం లావుపాటి మనిషి ఒకాయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదికమీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆయన తలా, ముడతలులేని ముఖమూ శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవులమీద, పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయంలేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నా లోంచి తొలగించడానికి ఆయన, ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు.

“బాబా ఆనంద్ (సంతోషం నాయనా!).” స్వాగత సూచకమైన ఈ పలకరింపు, నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను.

“ప్రణవానంద స్వామిగారు మీరేనాండీ?”