పుట:Oka-Yogi-Atmakatha.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ

527

“కళలు తరగని ఆనంద చంద్రబింబం,” అంటే భగవంతుడు; శాశ్వత ధ్రువతార; కాలక్రమ మెన్నడూ తప్పనివాడు. మళ్ళీ ఉదయిస్తున్న “దివ్యేందుబింబం” అంటే బాహ్య ప్రపంచం; నియతకాలిక పునరావర్తన నియమానికి బద్ధమయినది. ఈ పారశీకద్రష్ట ఆత్మసాక్షాత్కారం ద్వారా ఈ భూమిమీద నిర్బంధ పునర్జన్మల శృంఖలాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించినవాడు. ఇక్కడ భూమి అన్నది: ప్రకృతి అనే “ఉద్యానం” లేదా మాయ. “ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు - వ్యర్థంగా నా కోసం!” సంపూర్ణ రహితమయిన దానికోసం అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం!

క్రీస్తు తన విముక్తినిగురించి మరో రకంగా చెప్పాడు. “ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు. స్వామీ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను. అందుకు క్రీస్తు ఇలా అన్నాడు - గుంటనక్కలకు బొర్రె లున్నాయి; గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి; కాని మనుష్య కుమారుడికి తలదాచుకోడానికయినా చోటు లేదు.”[1]

అంతటా తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మ సాధనలో తప్ప మరోవిధంగా అనుసరించగలరా?

కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు. దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్త్యుడి గురించి, చెప్పుకోదగ్గంత కావ్యసాహిత్యం తమిళంలో బయలుదేరింది. క్రీస్తు శకారంభానికి ముందూ ఆ తరవాతి శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు. ఆయన ఈనాటికీ భౌతిక రూపాన్ని నిలుపుకొనే ఉన్నట్టు ప్రతీతి.

  1. మత్తయి 8 : 19-20 (బైబిలు).