పుట:Oka-Yogi-Atmakatha.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

526

ఒక యోగి ఆత్మకథ

(“జీవించి ఉండగానే విముక్తిపొంది ఉన్నవాడు”) స్థితి నుంచి పరాముక్త (“సర్వోత్కృష్ట స్వతంత్రుడు” - మృత్యుంజయుడు) స్థితికి పురోగమించి ఉంటాడు. చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలోంచీ జన్మపరంపరావృత్తిలోంచీ పూర్తిగా బయటపడి ఉంటాడు. అందువల్ల పరాముక్తుడయినవాడు తిరిగి భౌతిక శరీరం పొందడమనేది సకృతు. ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాలా అవతార పురుషుడే; ప్రపంచానికి దివ్యమయిన దీవెనలు కురిపించడానికి దైవనిర్ణీతమైన సాధనమే. అవతారపురుషుడు విశ్వజనీన వ్యవస్థకు బద్ధుడు కాడు; తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధదేహం ప్రకృతికి ఏ విధంగానూ ఋణపడి ఉండదు.

సాధారణ దృష్టికి, అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేదీ అవుపించకపోవచ్చు. కాని ఒక్కొక్క సందర్భంలో దానికి నీడా పడదు, నేలమీద అడుగు జాడా పడదు. అంధకారాన్నించీ భౌతిక దాస్యాన్నించీ పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకలవంటి నిదర్శనాలివి. అటువంటి దైవ-మానవుడొక్కడే చావుపుట్టుకల సాపేక్షతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు. ఎంతగానో అపార్థానికి గురిఅయిన. ఉమర్ ఖయ్యాం ‘రుబాయత్’ అనే అమరగ్రంథంలో ఈ విముక్త మానవుణ్ణి గురించి ఇలా గానం చేశాడు:

“ఆహా, కళలు తరగతి నా ఆనంద చంద్రబింబం,
 ఉదయిస్తోంది మళ్ళీ దివ్యేందు బింబం;
 ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇకముందు
 ఇదే ఉద్యానంలో - వ్యర్థంగా నా కోసం!”[1]

  1. ఎడ్వర్డ్ ఫిట్జ్ జిరాల్డ్ అనువాదాన్ని అనుసరించి.